ఫైనాన్స్ కమిషన్‌తో తెలంగాణకు నష్టం

by  |
ఫైనాన్స్ కమిషన్‌తో తెలంగాణకు నష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసులతో రాష్ట్రానికి నష్టమే జరుగుతోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి మొత్తం కేంద్ర పన్నుల వాటాలో 2.437శాతం మేర రాష్ట్ర వాటాగా అందేది. కానీ పదిహేనవ ఆర్థిక సంఘం సిఫారసుల్లో అది 2.102కు తగ్గడం ద్వారా 0.335శాతం మేర రాష్ట్రానికి సుమారు రూ. 9,621 కోట్ల మేర నష్టం జరగనున్నట్లు అంచనా. అయితే ప్రతియేటా పన్నుల వసూళ్లలో వచ్చే తేడాలతో ఇది మారే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగానే 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రాష్ట్రానికి నిర్దిష్టంగా రానున్న ఐదేళ్ల కాలంలో (2021-26) ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనేదానిపై అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి ఐదేళ్ల కాలానికి కేంద్ర పన్నుల వాటాగా రూ. 88,806 కోట్లు, ప్రత్యేక ఆర్థిక సాయంగా రూ.2,362 కోట్లు, స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లు, గ్రామీణ సడక్ యోజన కింద రూ.255 కోట్లు, వైద్యారోగ్య పథకాలకు రూ.624 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో రూ.20,980 కోట్లు.. ఇలా మొత్తం రూ. 1,09,786 కోట్ల మేర రావాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు నిధులు విడుదల కాకపోవడంతో ఈసారైనా రానున్న ఐదేళ్ల కాలానికి అందుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కేవలం డివొల్యూషన్ (కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా) రూపంలోనే రూ.9,621 కోట్లను కోల్పోతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. కేంద్ర బడ్జెట్ సమర్పణ అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పలు ఆర్థిక అంశాలు, తెలంగాణపై కేంద్ర బడ్జెట్ ప్రభావం తదితర అంశాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలకు వస్తున్నట్లుగానే తెలంగాణకు కూడా వస్తున్నాయని, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్ర వాటా 2.437శాతం నుంచి 2.102 శాతానికి తగ్గిపోవడం ద్వారా నష్టపోతున్నట్లు వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

‘జల్ జీవన్‌’తో కాస్త ఊరట

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఇంటికి నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందించే ‘మిషన్ భగీరథ’ అమలు చేస్తున్నందున ఇదే దిశగా కేంద్రం కూడా ‘జల్ జీవన్ మిషన్’ పథకాన్ని అమలుచేయాలనుకుంటున్నందున దీనికి కేటాయించే రూ.60,800 కోట్లలో తెలంగాణకు కూడా కొంత వస్తుందని, అది ఒక మేరకు ఉపశమనంగానే ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని తెలంగాణ ఇప్పటికే అమలు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కోసం చేసే కేటాయింపుల్ని వినియోగించుకునే వీలు కలుగుతుందని, రెండు పథకాల లక్ష్యం ఒకటేనని వివరించారు.

నాలుగు శాతానికి పెరిగిన ఎఫ్ఆర్‌బీఎం

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతీ రాష్ట్రానికి వాటివాటి జీఎస్‌డీపీలో మూడు శాతం మేర రుణాలను తీసుకునే అవకాశం ఉంది. కరోనా తదనంతర పరిస్థితుల్లో దీన్ని ఐదు శాతానికి పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రంపై వత్తిడి పెరిగింది. తాజా బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి ఎఫ్ఆర్‌బీఎం చట్టానికి సవరణలు చేసి నాలుగు శాతానికి పెంచే ప్రతిపాదన చేశారు. ఆ ప్రకారం తెలంగాణకు కూడా అదనంగా అప్పులు చేసుకోడానికి వీలు కలుగుతుంది. దీనికి అవసరమైన చట్ట సవరణ కూడా ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. ఆ ప్రకారం రాష్ట్రానికి అదనంగా సుమారు పది వేల కోట్ల మేర రుణం పొందడానికి మార్గం సుగమమవుతుంది.

Next Story

Most Viewed