14 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

by  |
14 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రైతాంగాన్ని వానాకాలం నిండా ముంచింది. వేసిన పంటల్లో పది శాతం నీటిపాలయ్యాయి. ఆగస్టు నుంచి అక్టోబర్​ వరకు కురిసిన వానలకు 14 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం అక్టోబర్ నెలలో ఎక్కువగా జరిగింది. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పంటల నష్టంపై అసలు క్షేత్రస్థాయి పరిశీలనకే అనుమతివ్వలేదు. కేంద్రానికి మాత్రం ప్రాథమిక నివేదికలను పంపించారు.14 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోగా.. మొత్తం రూ.8,633 కోట్లు రైతులకు నష్టం జరిగినట్లు నివేదికల్లో వెల్లడించారు. ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోగా కేంద్రంపైనే భారం వేసింది. కనీసం కేంద్రమైనా ఆదుకుంటుందని ఆశించినా అసలు సమాధానమే లేదు.

వానాకాలం భారీ నష్టం

వానాకాలం సీజన్‌లో పంటల సాగు పెరిగిందనే సంబురం రైతులకు లేకుండా పోయింది. అకాల వర్షాలు పంటలను ధ్వంసం చేశాయి. అక్టోబర్‌లో కురిసిన వానలు పెను నష్టాన్ని మిగిల్చాయి. 33 ఏండ్లలో లేని వర్షం ఈసారి రికార్డు అయింది. ఈ వానలతో రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల ఎకరాల్లో పంటలు అక్కరకు రాకుండా పోయాయి. నియంత్రిత సాగు కింద వేసిన సన్న వరి భారీగా నష్టం చేసింది. వరి, పత్తి, కంది, మిర్చి, మొక్కజొన్న, పెసర, సోయాబీన్ పంటలు మొత్తంగా 14 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేశారు. ఈ పరిణామాలతో రైతులకు రూ.8,633 కోట్లు నష్టం జరిగిందని, ఎనిమిది వేల కోట్ల విలువైన పంటలను నష్టపోయారని కేంద్రానికి నివేదించారు. వాస్తవంగా అతివృష్టి ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి సర్వే చేయిస్తోంది. గ్రామస్థాయి నుంచి వ్యవసాయ, రెవెన్యూ శాఖ నుంచి నివేదికలు స్వీకరిస్తుంది. కానీ ఈసారి పంటల నష్టంపై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి నివేదికలు పంపించారు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కా లెక్కలు తీయలేదు.

హామీ ఇవ్వని రాష్ట్ర సర్కారు

పంటల నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం హామీ కూడా లేదు. చాలా ప్రాంతాల్లో వర్షానికి ధాన్యం, పత్తి, పంట ఉత్పత్తులు తడిసిపోయాయి. పత్తి మొత్తం నల్లబడిపోయింది. ధాన్యం పొలాల్లోనే రాలిపోయింది. ఇదంతా ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదించినా.. కనీసం హామీ కూడా రాలేదు. సీఎం కేసీఆర్​వ్యవసాయ శాఖపై పదేపదే సమీక్షించినా.. పంటల నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ప్రభుత్వాలు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి పరిహారం చెల్లించేవి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం కేంద్రానికి నివేదించి చేతులు దులుపుకున్నారు.

కేంద్రం కూడా అంతే

కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైతులపై పగ పట్టినట్లు చేసింది. నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపించింది. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, సీఎం, సీఎస్‌తో భేటీ అయిన కేంద్ర బృందం నివేదికలన్నీ తీసుకుని వెళ్లిపోయింది. దాదాపు నెలన్నర రోజులు దాటినా కేంద్రం నుంచి కూడా ఎలాంటి సమాధానం లేదు. అయితే వరదల నష్టంపై తక్షణ సాయంగా కేంద్ర ప్రభుత్వం రూ.224.50 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అక్టోబర్‌లోనే ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్​నుంచి దీన్ని అందిస్తామని కేంద్రం ప్రకటించినట్లు చెప్పారు. కానీ ఈ నిధుల్లో నుంచి రైతులకు రూపాయి కూడా రాలేదు.

క్షేత్రస్థాయిలో నష్టం రెండింతలు పైనే..

అసలు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర రైతాంగం వానలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తరా.. ఇయ్యరా అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాథమికంగా రూ.8,633 కోట్లు అంచనా వేశారని, కానీ క్షేత్రస్థాయిలో ఈ నష్టం రెండింతలుగా ఉంటుందని రైతులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం అంచనా వేసిన ప్రకారం ఈ పరిహారం అయినా వస్తుందా అనే క్లారిటీ లేకపోవడంతో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు.



Next Story

Most Viewed