నకిలీ @నల్లగొండ.. అసలు సూత్రధారులెవరు..?

by  |
Fake Seeds Selling In Nalgonda District
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నకిలీ విత్తనాలకు నల్లగొండ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.20 కోట్ల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. ఏటా నకిలీ విత్తన దందా ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ ఈ ఏడాది అనుహ్యంగా పోలీసు శాఖ భారీ స్థాయిలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏటా రూ.కోట్లలో నకిలీ విత్తన దందా జరగడం పరిపాటి. అయితే ఏటా ఇటు వ్యవసాయశాఖ.. అటు పోలీసు శాఖ ఫేక్ సీడ్స్ అరికట్టడంలో విఫలమవుతున్నాయనే ఆరోపణల్ని మూటగట్టుకోవాల్సి వస్తోంది. నిజానికి ఈ నకిలీ విత్తన దందా వెనుక పెద్ద తలకాయలే ఉన్నా.. ప్రస్తుతానికైతే.. నామమాత్రపు పాత్రధారుల్ని పట్టుకోవడమూ చర్చించదగినదే. అసలు సూత్రధారులెవరు..? వారి భరతం పోలీసు శాఖ పడుతుందా..? ఈయేడు పూర్తిగా నకిలీరాయుళ్ల ఆటలు కట్టిస్తుందా..? అనేది వేచిచూడాల్సిందే..

పక్క జిల్లాల నుంచే భారీగా..

ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే వరిపంట సాగులో రికార్డు సృష్టిస్తోంది. అదే సమయంలో పత్తి పంట సాగు విషయంలోనూ జిల్లాది సింహాభాగమే. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని నకిలీ విత్తనాలను భారీ స్థాయిలో నల్లగొండకు తరలిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఫేక్ సీడ్స్‌ను జిల్లాలో డంప్ చేసి పెడుతున్నారు. ప్రధానంగా కృష్ణపట్టె ప్రాంతంతో పాటు దేవరకొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలతో పాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే పెద్దఎత్తున నకిలీ సీడ్స్ దిగుమతి అయ్యింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిలీ విత్తనాల తయారీ కేంద్రాలు చాలా తక్కువే. జిల్లాకు వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతున్నాయి. నకిలీ విత్తనాలు సైతం ఈ జిల్లాల్లోనే తయారవుతున్నట్టు సమాచారం.

గుంటూరు విత్తన ప్యాకెట్ రూ.600కే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం పత్తి విత్తనాల ప్యాకెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందులో భాగంగానే నల్లగొండ జిల్లా సరిహద్దు జిల్లాగా ఉన్న గుంటూరు నుంచి భారీగా నకిలీ విత్తన ప్యాకెట్లు నల్లగొండ జిల్లా కేంద్రంలో దిగుమతి అయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో విత్తన ప్యాకెట్ రూ.650 నుంచి రూ.700 వరకు ధర పలుకుతోంది. కానీ గుంటూరు జిల్లా నుంచి వచ్చిన నకిలీ విత్తన ప్యాకెట్లు మాత్రం రూ.600 ఇస్తుండడం గమనార్హం. దీంతో కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి, తిప్పర్తి, నార్కట్‌పల్లి, నాంపల్లి తదితర మండలాల్లోని రైతులకు ఈ విత్తన ప్యాకెట్లను అంటగడుతున్నారు. అయితే నకిలీరాయుళ్లు ఎప్పటికప్పుడు తమ అక్రమ దందా వ్యాపార మార్గాలను మారుస్తూ వస్తున్నారు. కొన్ని విత్తనాలను లూజ్‌గా(ప్యాకెజీ లేకుండా) అమ్మితే.. మరికొంతమంది అనధికారికంగా విత్తనాలను ప్యాక్ చేసి.. వాటికి నకిలీ లేబుళ్ల ముద్రించి రైతులకు ఇస్తుంటారు. మరికొంతమంది గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి దళారుల ద్వారా దుకాణాల్లోకి పంపిస్తుండడం ఇక్కడ పరిపాటి.

ప్రైవేటు కంపెనీలతోనే అసలు చిక్కు..

వాస్తవానికి విత్తనాలకు సంబంధించి వరి, కంది పంటలకు మినహాయించి మిగతా అన్నిరకాల పంటల విత్తనాల కోసం రైతాంగం పూర్తిగా ప్రైవేటు కంపెనీల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో వరి తర్వాత సింహభాగం పత్తి, మిర్చి, మొక్కజొన్నదే. ఇదిలావుంటే.. కంది, వరి పంటలకు సంబంధించి 50 శాతం ప్రైవేటు కంపెనీ విత్తనాలే కావడం గమనార్హం. ఇవేవీ చట్టం పరిధిలోకి రాకపోవడం గమనార్హం. ప్రభుత్వం సైతం ప్రైవేటు కంపెనీలపై పర్యవేక్షణ లేకపోవడం.. కొంతమంది వ్యవసాయశాఖ అధికారులు ప్రైవేటు విత్తన కంపెనీలతో చేతులు కలపడం.. ఫలితంగా నకిలీ విత్తనాల ఫలితంగా రైతులు కోలుకోలేకపోతున్నారు.

ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు..

ఈనెల 7వ తేదీన సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో కారులో అక్రమంగా తరలిస్తోన్న 2.922 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు రూ.70 లక్షల వరకు ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని నాచవరం, కుఫ్టీగి కేంద్రంగా ఇవి తయారవుతోన్నట్లు పోలీసులు తేల్చారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లోని వనస్థలిపురం కేంద్రంగా అనంతపురం జిల్లాకు చెందిన మూలపాటి శివారెడ్డి ‘ద్వారకా’ సీడ్స్‌ పేరుతో కొంతకాలంగా విత్తనాలను తెలంగాణలోని పలుజిల్లాలో అమ్ముతున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడులో అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్నారంటూ రెండు రోజుల కిందట కొందరు రైతులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు స్థానిక డీలర్‌ జగన్మోహన్‌రావును విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 10వ తేదీన సూర్యాపేటలో ఆరుగురు నిందితుల ముఠాను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.13.5 కోట్ల విలువైన 986 కిలోల విత్తనాలు, రెండు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మిరప విత్తనాల విలువే రూ.10.93 కోట్లని పోలీసులు తెలిపారు.

ఈనెల 12న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో నకిలీ విత్తనాలను అక్రమంగా తరిలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి.. 35 కేజీల విత్తనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. విత్తనాలను.. నిందితుడు కుమురం భీం జిల్లా నుంచి తీసుకువస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన మరో వ్యక్తి నుంచి 413 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈనెల 13న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ మొత్తంలో విత్తనాలను పట్టుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 15 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఐదు రోజుల క్రితం నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురిని అర్వపల్లి పరిధిలో అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్​లోని వనస్థలీపురం, ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి భారీగా నకిలీ విత్తనాలు సీజ్ చేశారు.

తాజాగా శుక్రవారం నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాల దందా వెలుగులోకి వచ్చింది. రూ. 6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ అక్రమాలకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన మధుసూదన్‌ రెడ్డిప్రధాన సూత్రధారిగా ఈ నకిలీవిత్తనం వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రుతి సీడ్స్‌ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఎంజీ అగ్రోటెక్‌ ప్రతినిధులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు తేలింది.

Next Story