కరోనా: 3 లక్షల మార్క్ దాటిన కేసులు

by  |
కరోనా: 3 లక్షల మార్క్ దాటిన కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి దాకా సగటున రోజుకు తొమ్మిది వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతుండగా శుక్రవారం ఏకంగా 10,956 కేసులు వచ్చాయి. ఇప్పటి దాకా ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,04,019కు చేరుకుంది. ప్రపంచంలో అధిక కేసులు నమోదైన దేశాల్లో నాలుగవ స్థానంలో ఉంది భారత్. ఒక్క రోజు వ్యవధిలో 396 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8,497కు చేరుకుంది. మహారాష్ట్రలో మొత్తం కేసులు 1.01 లక్షలు దాటగా తమిళనాడులో 40 వేలు దాటింది.

దేశంలో ఈ నెల 2వ తేదీన దేశం మొత్తం మీద 1,98,706 కేసులుంటే కేవలం 10 రోజుల్లో లక్షకుపైగా పెరిగి 3 లక్షల మార్కును దాటింది. మూడు వేల మంది కొత్తగా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల కొవిడ్ కేసులతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా 8 లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో, 5 లక్షల కేసులతో రష్యా మూడవ స్థానంలో ఉంది. బ్రిటన్‌ను దాటి నాల్గవ స్థానానికి చేరుకుంది భారత్. దేశంలో ఇప్పటివరకు 1,47,195 మంది కోలుకోగా 1,41,842 మంది ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో కొత్తగా 3,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,141కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజే 90 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 55,357కి, మృతుల సంఖ్య 2042కు చేరుకుంది. ఇక తమిళనాడులో ఒక్కరోజే 1,982 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 40,698కి చేరింది. కొత్తగా నమోదైన వాటిలో రాజధాని చెన్నైలోనే 1477 కేసులున్నాయి . రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 18 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 367కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో 2,137 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,824కు చేరింది. ఇక్కడ ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య ఇదే అత్యధికమవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో కరోనా బారిన పడి ఒక్కరోజే 71 మంది మరణించడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,214కు చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 495కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య22,562కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 31 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1416కు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 141 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,402కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,723 యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 80 మంది మరణించారు.

Next Story

Most Viewed