జీతం అడిగితే ‘జాబ్’​పోతది.. అంబులెన్స్​​ స్టాఫ్ ఆవేదన

by  |
జీతం అడిగితే ‘జాబ్’​పోతది.. అంబులెన్స్​​ స్టాఫ్ ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యవసర పేషెంట్లను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్ ​సిబ్బంది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కరోనా ప్యాండమిక్​ పరిస్థితుల్లోనూ ఎంతోమంది బాధితులను దవాఖాన్లకు చేర్చి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది పరేషాన్​ అవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. టెక్నీషియన్లు, డ్రైవర్లకు గత రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు చెల్లించాలని అడుగుతున్న వారిని జాబ్​ నుంచి తొలగిస్తామని జీవికే సంస్థ బెదిరిస్తుందని 108 ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని చెబుతూ జీవికే కాలం నెట్టుకొస్తున్నట్టు ఉద్యోగులు వివరిస్తున్నారు. దీంతో సుమారు 2 వేల మంది సిబ్బంది ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

ఇప్పటికే ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల స్కూల్​ ఫీజులు చెల్లించలేక కుటుంబ పోషణ భారంగా మారిందంటున్నారు. పని చేయించుకొని రోడ్డున పడేస్తే ఎట్లా? అని ప్రశ్నిస్తున్నారు. 108 పర్యవేక్షణకు ప్రభుత్వం తరపున ప్రత్యేక అధికారి లేకపోవడంతోనే ఇలాంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నట్లు యూనియన్​ నాయకులు వివరిస్తున్నారు. దీంతోనే జీవికే సంస్థ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఉద్యోగుల నాయకుల్లో ఒకరు దిశకు తెలిపారు.

సిబ్బంది డబ్బులతోనే చిన్న రిపేర్లు

108 విభాగంలో ఉన్న పాత అంబులెన్స్​ లతో సిబ్బంది తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆగిపోయిన క్రమంలో సొంత డబ్బులతో రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుందని పలువురు సిబ్బంది వెల్లడిస్తున్నారు. పంచర్లు, చిన్నపాటి రిపేర్లు, మధ్యలో డీజీల్​ అయిపోవడం వంటి సమస్యలు జిల్లా స్థాయిలో ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇలాంటి క్రమంలో పేషెంట్ల రక్షణ దృష్ట్యా సొంత డబ్బులతో రిపేర్లు చేయిస్తున్నామని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత ఆఫీసర్లకు చెప్పినా, క్లైయిమ్​ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా 440 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో ప్రతి రోజూ కనీసం 420 అంబులెన్స్‌లు విధుల్లో ఉండాలి. కానీ, ఇందులో వంద వాహనాలు కూడా రోడ్డు ఎక్కడం లేదని స్వయంగా 108 పైలట్లు చెబుతున్నారు. మిగతావన్నీ పాతవి కావడం, ఎక్కడిపడితే అక్కడ అగిపోతుండటంతో డ్రైవర్లు వాటిని తీసేందుకు భయపడాల్సి వస్తుందని 108 సిబ్బంది చెబుతున్నారు. పర్యవేక్షణ లోపంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని 108 ఫైలెట్లు చెబుతున్నారు. అంతేగాక చాలా వాహనాలకు టెక్నీషియన్లు లేరని దీంతో రెండు పనులను డ్రైవర్లే చేయాల్సి వస్తుందన్నారు. సరైన సమయంలో జీతాలు ఇవ్వకపోవడంతో కొందరు మానేస్తుండగా, మరి జీతాలు కోసం అడిగిన వారిని జీవికే సంస్థ తొలగిస్తున్నట్టు పేర్కొంటున్నారు. 108లోని రెండు విభాగాలకు సుమారు వెయ్యి మంది డ్రైవర్లు, వెయ్యి మంది టెక్నీషియన్లు అవసరం ఉండగా, ప్రస్తుతం కేవలం 1468 మంది మాత్రమే ఉన్నారని 108 యూనియన్​ నాయకులు స్పష్టం చేశారు.

కాంట్రాక్ట్​ ముగిసినా..

జీవీకే సంస్థ కాంట్రాక్ట్‌ ముగిసి మూడు ఏండ్లు దాటింది. కొత్తగా టెండర్లు పిలిచి, తక్కువ కోట్ చేసిన వాళ్లకు నిర్వాహణ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వానికి హెల్త్ ఆఫీసర్లు గతంలో ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇప్పటివరకూ ఆ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పటికీ జీవీకే సంస్థనే కొనసాగిస్తున్నారు. సకాలంలో జీతాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. అంబులెన్స్‌లు నడిపినా, నడపకపోయినా ఆ సంస్థను అడిగేవారు లేరనే ధైర్యంతోనే జీవికే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిబ్బంది చెబుతున్నారు.

జిల్లాల్లో గంటలు గడిచినా రావట్లే..

అంబులెన్స్‌ల నిర్వాహణపై ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. యాక్సిడెంట్లు, ఇతర అత్యవసర సమయాల్లో కేవలం 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాల్సిన అంబులెన్స్‌లు, గంటలు గడిచిన రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాల్లో బాధితులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో చాలామంది సకాలంలో వైద్యం అందక మార్గ మధ్యలోనే చనిపోతున్నారు. వికారాబాద్​ జిల్లా మల్కనగిరి విలేజ్​ లో సెప్టెంబరు 16వ తేదిన సకాలంలో అంబులెన్స్​ చేరుకోకపోవడంతో పాటు టెక్నీషియన్​ లేక ఓ మహిళ చనిపోవడం స్థానికులను కలచివేసింది. దీంతో ఆ గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed