సారూ.. అజీర్తి కా(రు)దిక్క!

by  |
సారూ.. అజీర్తి కా(రు)దిక్క!
X

తను తప్ప.. మరేదీ మొలకెత్తవద్దనీ, చెట్టుగా ఎదొగద్దన్నది మర్రివృక్షం గుణమట! తెలంగాణ రాజకీయాలు అచ్చం గట్లనే ఉన్నై. అన్నీమాకే కావాలి. అన్నీ మేమే ఏలాలి అని టీఆర్ఎస్ కంకణం కట్టుకున్నది. వార్డు మొదలు రాష్ట్రం దాకా కారు మాత్రమే దున్నేయాలని గుత్త పట్టింది. యథా అధినేత తథా కేడరు అన్నట్టుగా టాప్ టు బాటమ్ ఒకటే తీరు. గల్లీ గులాబీ నుంచి రాజధాని పెద్దసారు దాకా ఒకటే పంథా. ఏ ఒక్క పొలిటికల్ పార్టీ పోగుపోయొద్దు. మరే నేతా కోలుకోవద్దు. కూసుంటే ‘కారు’లోనే లేదా ఇంట్లోనే అన్నట్టుగా ఉన్నది. ఎంపీ, ఎమ్మెల్యే పోస్టు ఏదైనా హోదా మరేదైనా ఒకటే లెక్క. రాష్ట్రంలో ఇదేమీ కొత్త కాకోపోవచ్చు. ఆఖర్కి, రైతులకు సంబంధించిన ఎన్నికల్లోనూ అదే శైలిలో పోతున్నది. స్వచ్ఛంగా, పొలిటికల్ పొల్యూషన్ లేకుండా పవిత్రంగా జరగాల్సిన వాటినీ వదలడంలేదు. రాజకీయాలకు అతీతం కావాల్సిన సహకార సంఘాల ఎలక్షన్లలోనూ రాజకీయాలనే పారిస్తున్నది. అయితే బ్యారాలు, లేదంటే బెదిరింపుల పోకడను వీడడంలేదు. ఆర్మూరులో బరిలో నిలిచినవారిని భయపెట్టారట. స్వయానా లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అనుచరులే పోటీలో ఉండకూదంటూ వార్నింగ్ ఇవ్వడంపై స్థానిక మున్నూరు కాపు సంఘం పెద్దలు మండిపడ్డారు. అది జెస్ట్ ఎగ్జాంపులే. రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే తంతు. పాత ఖమ్మం జిల్లాలోనూ అంతే. యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డిపెల్లి సొసైటీ. కాంగ్రెస్ మద్దతుతో డైరెక్టరు పోస్టు కోసం ఒకాయన నామినేషన్ వేశాడు. తీరా, టీఆర్ఎస్ సపోర్టుతో ఏకగ్రీవమయ్యాడు. ఇట్లాంటి జంపింగ్‌లు, సర్కస్ ఫీట్లు స్టేట్ నలుమూలల్లో ‘కారు’ ప్రాయోజిత పుణ్య కార్యాలుగానే మిగిలిపోతున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్) ఎలక్షన్లలో కీలకఘట్టం పోలింగ్ కమ్ రిజల్ట్స్ ఈ నెల 15నే. డైరెక్టర్లుగా విజేతలయ్యేటోళ్లు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. సహకార, దాని అనుబంధ స్టేట్ లెవెల్ పోస్టులకు ఈ ఎన్నికలే మూలాధారం కావడంతో, గులాబీ దళం వీటిని గుప్పిట పడుతోంది! ఒకటైతే నిజం. ఫ్యూచర్‌లో, ఆర్మూరు మున్నూరు కాపు సంఘం పెద్దల మాదిరిగా ప్రతిచోటా గళం విప్పితే, అజీర్తి ఖాయం కాదా సారూ!


Next Story

Most Viewed