చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్

by Disha Web Desk 15 |
చెరుకు ఫ్యాక్టరీలు తెరిచే యత్నం ఎన్నికల స్టంట్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెరుకు రైతులను, కార్మికులను మోసం చేసేందుకే షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణ పేరిట 43 కోట్ల నిధులను విడుదలకు బ్యాంకర్లతో చర్చలు జరిపిందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఫ్యాక్టరీ తెరవడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెరుకు రైతులను ఆదుకోవాలని, చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, దానికి ఒక విధి విధానాలు అంటూ ఏమీ లేవని, అసలు ఫ్యాక్టరీల పున: ప్రారంభానికి ప్రణాళిక లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే చక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఒక కమిటీ వేశారని, ఆ కమిటీలో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారని,

వారు ఫ్యాక్టరీని సందర్శించి 2025 డిసెంబర్ లో ఫ్యాక్టరీ తెరవచ్చని ఒక నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం ఎన్నికలు ఉన్నాయని ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటించిన రేవంత్ రెడ్డి మాట మార్చి చక్కెర ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17 లోపు తెరుస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎంత బూస్ట్ ఇచ్చినా మైలేజీ పెరగకపోవడంతో కేవలం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి కోసమే రూ.43 కోట్లను బ్యాంకుల బకాయిలు కట్టేందుకు నిధులు విడుదల చేశారని అన్నారు. నాలుగు బ్యాంకులకు 3 చక్కెర కర్మాగారాల నుంచి 202 కోట్ల బకాయిలు ఉన్నాయని అవి 12 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉందని తెలిపారు. వాటిని కట్టిన తర్వాత ఫ్యాక్టరీ పార్ట్నర్ గా ఉన్న గోకరాజు గంగరాజుకు 262 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితుల్లో నడవలేదని, యంత్రాల మరమ్మతుల కోసం మరో 50 కోట్లు అవసరమని పేర్కొన్నారు. చెరుకు రైతులకు చెరుకును పండించడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉందని, ఇవి అదనమని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల స్టంట్ గా రూ. 43 కోట్లు విడుదల చేసి తాము ఫ్యాక్టరీ తెరుస్తామని ప్రజలను, రైతులను వంచించేందుకు సిద్ధమైందని, ఎన్నికలు పూర్తయితే ఆ పార్టీకి ఎవరు గుర్తు రారని అన్నారు.

దాదాపు 800 కోట్ల నిధులు సమకూరినా చక్కెర కర్మాగారం నడిపేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, దాని పార్ట్నర్ కూడా సుముఖంగా లేడని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు ప్రస్తుత కాలంలో ఈథనాల్ ని ఖచ్చితంగా వినియోగిస్తేనే అవి నడిచే పరిస్థితి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చక్కెర ఫ్యాక్టరీ తెరిచే ఉద్దేశం లేదని, అందుకే కమిటీ ఇచ్చిన రిపోర్టును పక్కనపెట్టి ఫ్యాక్టరీ తెరుస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా రేవంత్ రెడ్డి హయాంలోని యంత్రాంగం ఏర్పాటు చేసిన చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ లోని సభ్యులైన మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కమిటీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 800 కోట్లు అవసరం ఉన్నచోట 43 కోట్లు విడుదల చేసి ప్రజలను మరోసారి మభ్యపెడుతున్నారని అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించకపోగా అందులోని యంత్రాలు పని చేయవని, వాటిని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి ఫ్యాక్టరీల భూములను అమ్మకానికి , కబ్జాకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. దేశంలో 62 చక్కెర కర్మాగారాలను తెరిచిన ఘనత బీజేపీదని గుర్తు చేశారు.

తొమ్మిది వేల కోట్లతో దేశంలో చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణతో పాటు ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని గుర్తు చేశారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,ఓబీసీ రిజర్వేషన్లకు వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని తెలిపారు. ప్రముఖ అలీగఢ్ యూనివర్సిటీని, జామియా ముస్లిం యూనివర్సిటీలో ప్రత్యేక చట్టాల ద్వారా రిజర్వేషన్లను రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. కేవలం మత ప్రాతిపదికన యూనివర్సిటీలకు మైనార్టీ హోదా ఇచ్చి అందులో ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఉద్యోగ, విద్యా అవకాశాల్లో రిజర్వేషన్లు తొలగించారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే హైదరాబాద్ యూనివర్సిటీతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీలను కూడా ముస్లిం యూనివర్సిటీలుగా మారుస్తారని ఆరోపణలు చేశారు. ఇక్కడ పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ స్టాండర్డ్ ఏంది అనేది ఇప్పటికీ స్పష్టం చేయడం లేదని అన్నారు.

హిందువులకు పౌరసత్వం వద్దని ఆందోళన చేసిన చరిత్ర జీవన్ రెడ్డిది అన్నారు. రోహింగ్యాలకు పాస్పోర్టుల వ్యవహారంపై, ఉత్తర దక్షిణ భారతంలో జరిగిన బాంబు పేలుళ్లకు జగిత్యాలలో లింక్ ఉండడంపై జీవన్ రెడ్డి వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీకి హిందువులంటే చిత్తశుద్ధి ఉందని అందుకే దళితులకు, గిరిజనులకు, బహుజనులకు, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని, దానిని తొలగిస్తున్నారని కేవలం కాంగ్రెస్ పార్టీ బూటకపు ప్రచారం చేస్తుందని అన్నారు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో

తెలంగాణలో గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తామని ఎందుకు చేర్చలేదని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇండియన్ పీపుల్స్ ఫోరం ఆధ్వర్యంలో గల్ఫ్ లోని ప్రవాసీలకు ఉచిత వైద్యం, న్యాయ సేవలను దశాబ్ద కాలంగా అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి రైతుల రుణమాఫీ పై చిత్తశుద్ధి లేదని రేవంత్ రెడ్డి ఆగస్టు 15 న 2 లక్షల మాఫీని చేస్తామని ఓటర్లకు హామీ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీ పై కమిషన్ వేస్తామని ఉందని, దానికి రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed