‘ఉమ్మడి AP కంటే BRS పాలనలోనే ఎక్కువ దోపిడి’

by Disha Web Desk 4 |
‘ఉమ్మడి AP కంటే BRS పాలనలోనే ఎక్కువ దోపిడి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు పలికిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా కేవలం లక్షా 30 వేల ఎకరాలకే మాత్రమే నీళ్లు అందించారని మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించామని కేసీఆర్ చెప్పిన మాటల్లో నిజం లేదని కొట్టిపరేశారు. మాజీ సీఎం పచ్చిఅబద్దాలు చెప్తూ, జనాలను మోసం చేసేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసన సభ్యులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ అబద్దాలకు అవధులు లేవన్నారు. ఏదీ చెప్పినా నిజం అనుకుంటారనే భ్రమలో ఉన్నాడన్నారు. అధికారం కోల్పోగానే కేసీఆర్ మైండ్ సరిగ్గా పనిచేయడం లేదన్నారు. తానే చీఫ్​ఇంజినీర్, కాంట్రాక్టర్ గా వ్యవహరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి అదనపు భారం పడుతుందన్నారు.

కమీషన్ల కోసం రీ డిజైన్ చేశారన్నారు. దీంతో ఏడాదికి పది వేల కోట్లు పవర్ బిల్లు కట్టాల్సి వస్తుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నారు. అప్పుడు మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు రిపేర్లు చేయిస్తానని చెప్పడం హస్యాస్పదంగా ఉన్నదన్నారు. పిల్లర్లు కూలిపోయిన తర్వాత నీళ్లు వదిలేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నీళ్లు వదిలేసిందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. నేషనల్ డ్యామ్ సేప్టీ అధికారులు పరిశీలించి నిర్మాణంలో,డిజైన్ లో లోపం ఉన్నట్లు గుర్తించామని రిపోర్టు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. వాస్తవానికి ప్రాణహిత చేవెళ్ల కింద 16 లక్షల ఎకరాలకు సంపూర్ణంగా అతి తక్కువ ఖర్చుతో మెజార్టీ పార్ట్ గ్రావిటీ ద్వారా నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ, పైసలకు కక్కుర్తి పడి రీ డిజైన్ చేశారన్నారు. తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉంటే ప్రతీ ఏడాది కేవలం వెయ్యి కోట్లు ఖర్చు మాత్రమే వచ్చి ఉండేదన్నారు.

25 మంది చేరతారు...?

లోక్ సభ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు కూడా రాదన్నారు. 15 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లోకి 25 మంది వార్డు మెంబర్లు కూడా జాయిన్ అవ్వలేరని, కానీ కాంగ్రెస్ లోని 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కేసీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో తప్పుడు ప్రచారం చేశాడన్నారు. పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ ఇలాంటి అవాస్తవాలను వెల్లడించారని ఉత్తమ్ స్పష్టం చేశారు.

కేసీఆర్ హయంలోనే ఎక్కువ నష్టం...?

ఇక ఉమ్మడి ఏపీ కంటే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు పవర్ లోని బీఆర్ఎస్ పార్టీ వలనే ఎక్కువ నష్టం జరిగిందని ఉత్తమ్ వెల్లడించారు. నాగార్జున సాగర్ లో పదేళ్ల పాటు ఏపీకే ఎక్కువ నీళ్లు అలకేషన్ జరిగిందన్నారు. కష్ణానదీ జలాల విషయంలో ఎక్కువ దోపిడి జరిగిందన్నారు. జగన్ తో చేతులు కలిపి తెలంగాణ ను అస్తవ్యస్తం చేశాడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానదీ జలాలను ప్రతీ రోజు కేవలం 4.1 టీఎంసీలు రిలీజ్ చేయగా, గత పదేళ్లలో ప్రతీ రోజు 9.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. శ్రీశైలం బ్యారేజ్ నుంచి అధిక నీళ్లను తరలించారన్నారు.

దీంతో పాటు డిండీ, పాలమూరు రంగారెడ్డితో పాటు ఎస్ ఎల్ బీసీ, ఉమ్మడి నల్లగొండ లోని పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వహించిందన్నారు. త్వరలోనే డిండీ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి చివరి గ్రామం వరకు నీళ్లను అందిస్తామన్నారు.

సీఎం చెప్తేనే...?

కేసీఆర్ చెప్తేనే పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ కీలక లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ కు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. టెలీ గ్రాప్ యాక్ట్ కింద చర్యలు తప్పవన్నారు. అన్ని ఎంక్వైరీలు కొనసాగుతున్నాయని, త్వరలోనే సంపూర్ణమైన రిపోర్టు తేలుతుందన్నారు. హోం సెక్రటరీ అనుమతి లేకుండా చేస్తే దారుణమైన శిక్షలు ఉంటాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కేసీఆర్ భయపడి ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు.

కేసీఆర్‌ది దొంగ దీక్ష : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్వయంగా డాక్టర్లే ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, అన్ని రిపోర్టులు ఉన్నాయని వాటిని మీడియాకు అందజేస్తామని చెప్పారు. డీ విటమిన్ ఇంజక్షన్లు, ఇతర లిక్విడ్లు తీసుకుంటూ దీక్ష పేరిట డ్రామా ఆడారన్నారు. మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్​ రావు నుంచి అన్ని ఆధారాలు సేకరించామన్నారు. కేసీఆర్ కు ప్రస్తుతం ఏమీ పనిలేనందునే టీవీలో 4 గంటల పాటు డిబెట్ కు హాజరయ్యాడన్నారు. మిడ్ మానేరు డ్యామ్ కొట్టుకుపోయిందని, దానికి కారణం కోమటిరెడ్డి అని కేసీఆర్ పదే పదే వ్యాఖ్యానించడం సరికదన్నారు.

తనకు ఎలాంటి కాంట్రాక్ట్ సంస్థలు లేవన్నారు. అది తన సోదరుడి కంపెనీ అని, అగ్రిమెంట్లు ప్రకారమే పనులు జరిగాయన్నారు. స్వల్పపాటి వర్క్స్ మిగిలి ఉంటే ముత్తయ్య నాయుడు అనే కంపెనీకి బాధ్యతలు అప్పగించి హరీష్​ రావు మూడు నాలుగు వందల కోట్లు కమీషన్లు సేకరించాడని ఆరోపించారు. ఇక కేసీఆర్ బిడ్ల పూల చాటును బాటిళ్లు అమ్మి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నదన్నారు. తెలంగాణ పరువు తీసేసిందన్నారు. విద్యుత్ విషయంలో 7 వేల మెగావాట్ల నుంచి 12 వేలకు పెంచామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పాడన్నారు.



Next Story