కేటుగాళ్లతో నకిలీ వి‘పత్తి’..! టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ అధికారుల ఫోకస్

by Shiva Kumar |
కేటుగాళ్లతో నకిలీ వి‘పత్తి’..! టాస్క్‌ఫోర్స్, వ్యవసాయ అధికారుల ఫోకస్
X

దిశ, అయిజ: తొలకరి జల్లులు పలుకరించటంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. రైతుల నిరక్షరాస్యతను, వారి అమాయకత్వాలను ఆసరా చేసుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు విక్రయించి సొమ్ముచేసుకునేందుకు కేటు గాళ్ల ముఠాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నారాయణపేట జిల్లాలో ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీ సులు జరిపిన దాడుల్లో పెద్దఎత్తున నకిలీ పత్తి విత్తనాలు బయటపడిన సంఘటనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ దందా చేసే కేటుగాళ్ళను ఆటకట్టించేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

రూ.9లక్షల విలువైన విత్తనాల పట్టివేత

2024 ఏడాదిలో నెలరోజుల్లోపే రూ.9లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఏప్రిల్ లో నారాయణపేట మండలం, సింగారం గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసుల సహకారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 16 బ్యాగుల్లో నిల్వ ఉంచిన 8.85 క్వింటాళ్ల నకిలీ హెచ్ టి కాటన్ విత్తనాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.8.85లక్షలని పోలీసులు ప్రకటించారు. ఈ విత్తనాలను కర్ణాటక రాష్ట్రం, గురుమిటకల్ కేంద్రంగా కొనుగోలు చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

తాజాగా ఈ నెల 17న మక్తల్ పోలీస్టేషన్ పరిధిలోని భూత్ పూర్లో పోలీసుల తనిఖీల్లో రూ.56వేల విలువైన 57.66 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. గతంలో నడిగడ్డగా పిలువబడే జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెళ్లి మండలంలో 2022 మేలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయంపై పోలీసులు కూఫీ లాగితే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు కేంద్రంగా నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, విత్తనాలకు రంగులు అద్ది, ప్రత్యేక ఆకర్షణగా తయారు చేయించిన పాకెట్లలో ఒరిజినల్ విత్తనాల మాదిరిగా గద్వాల ప్రాంతాల్లోని అనేక మంది రైతులకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు.

అప్పట్లో పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ రూ.30లక్షల పైనే ఉంటుందని పోలీసులు ప్రకటించారు. గతంలో ఈ విషయం పెద్ద సంచలంగా మారింది. ఇదే సంవత్సరం అయిజలో కూడా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు గుర్తించి 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మచ్చుకు ఈ సంఘటనలు కొన్నే అయినా పోలీసులకు, వ్యవసాయ అధికారులకు తెలియకుండా నకిలీ పత్తి విత్తనాల దందా భారీగానే జరుగుతుంటుందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది నకిలిదో, ఏది ఒరిజినల్ దో గుర్తు పట్టి కొనుగోలు చేసేందుకు కష్టమౌతుందని రైతులు వాపోతున్నారు.

క్రిమిసంహారక మందులను వదల్లేదు !

నకిలీ విత్తన దందా ఒకటే అనుకుంటే, నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తూ కడుపుకు అన్నం పెట్టే అమాయకపు రైతులను నట్టేట ముంచుతున్న దుర్మార్గులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. 2024 జనవరిలో గద్వాల ప్రాంతంలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న విషయం పోలీసులకు చేరడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఈ దందా గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక పోలీసులు తనిఖీలు చేశారు. ట్రేసర్, డిలిగేట్ కంపెనీలకు చెందిన క్రిమిసంహారక మందుల స్థానంలో కొందరు అదే కంపెనీ పేరుతో నకిలీ మందులను మార్కెట్లో విక్రయించారు. అప్పట్లో పోలీసులు రంగంలోకి దిగి నకిలీ మందుల బార్కోడ్ స్కాన్ చేసి లోతుగా పరిశీలిస్తే అవి బ్రాండెడ్ కంపెనీ పేరుతో రైతులకు విక్రయించిన నకిలీ మందులుగా తేలింది. ఈ మందులు ఎక్కడి నుంచి వచ్చాయని పోలీసులు ఆరా తీస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొందరు వ్యక్తుల నుంచి అక్రమ మార్గంలో కొనుగోలు చేసి నడిగడ్డలో రైతులకు విక్రయించినట్లు తేలింది.

విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నకిలీ మందులు విక్రయించిన వారిపై అప్పట్లో అయిజ పోలీస్టేషన్ లో ఆరు గురిపైన, ఇటిక్యాల పోలీస్టేషన్లో ఏడు గురిపైన కేసులు నమోదు చేసి, రెండు కంపెనీలకు చెందిన 20 బాటిళ్ల (ఒక్కో బాటిల్ 180 ఎమ్,ఎల్) నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం కూడా నడిగడ్డలో చర్చనీయాంశం అయింది. విత్తన నాణ్యతను గుర్తించేందుకు గ్రామస్థాయిలోనే పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విత్తన నాణ్యత ధృవీకరణ బోర్డ్ ఏళ్లుగా ప్రభుత్వాలకు సూచనలు చేస్తూనే ఉన్నది. అయినా ప్రభుత్వాలు గ్రామస్థాయిలో కాదు కదా నియోజకవర్గం స్థాయిలో కూడా విత్తన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదు. దీంతో రైతులకు నకిలీ విత్తనాల బెడద తప్పటం లేదు.

Next Story

Most Viewed