48 గంటల ముందు ఇవ్వాల్సిందే.. ఎలక్షన్ స్టాఫ్ కీలక ఆదేశాలు

by Disha Web Desk 4 |
48 గంటల ముందు ఇవ్వాల్సిందే.. ఎలక్షన్ స్టాఫ్ కీలక ఆదేశాలు
X

దిశ, సిటీబ్యూరో : త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన అభ్యర్థుల ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతుంది. అభ్యర్థులు చేసుకునే ప్రతి ప్రచార కార్యక్రమానికి ఎన్నికల సంఘం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థి తాను చేసుకోవాలనుకున్న ప్రచారానికి సంబంధించి నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్‌కు గానీ, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఎన్నికల అధికారి ఆఫీసులో గానీ, లేక సువిధ యాప్‌లో గానీ దరఖాస్తును 48 గంటల ముందు సమర్పించాలని జిల్లా ఎలక్షన్ స్టాఫ్ తేల్చి చెబుతుంది. అభ్యర్థి చేసుకోవాలనుకున్న ప్రచార కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులకు 24 గంటల ముందు అనుమతులు జారీ చేస్తున్నారు. అభ్యర్థులు చేసుకునే ప్రచారం తామిచ్చిన పర్మిషన్‌కు లోబడే జరగాలని, ప్రచారంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలుంటే వారికి అనుమతి ఇవ్వబోమని జిల్లా ఎన్నికల అధికారి ఆఫీసు వర్గాలు తేల్చి చెబుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండే వీడియోలు, ఆడియోలను తిరస్కరించిన తర్వాత, అభ్యర్థులు వాటిని ఏడిట్ చేసి మళ్లీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు.

పర్మిషన్ ఇచ్చిన తర్వాత..

ఎన్నికల బరిలో నిల్చిన అభ్యర్థి ప్రచారం కోసం అనుమతి జారీ చేసే ఎన్నికల సంఘం, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ప్రచారం ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే జరుగుతుందా? లేక అనుమతిని ఉల్లంఘించి జరుపుతున్నారా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే నియమించిన వీడియో గ్రాఫర్లు రికార్డు చేసిన ప్రచారం వీడియోను ఎన్నికల సంఘం నియమించిన వీడియూ వ్యూవింగ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించి, అందులోని లోపాలను గుర్తించి చర్యల కోసం జిల్లా ఎన్నికల అధికారి, పరిశీలకులకు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. ఉల్లంఘనను బట్టి సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కోడ్ ఉల్లంఘినట్లు రుజువైతే కేసు కూడా నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.

ఫిర్యాదుల కోసం సీ-విజిల్..

ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా, మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువులను పంపిణీ చేసినా, బాధ్యతాయుతమైన పౌరుడెవరైనా ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచి సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. ఈ ఫిర్యాదులను కేవలం వంద నిమిషాల్లోనే క్లియర్ చేయాలని ఆదేశాలున్నట్లు సమాచారం. ఇందులో అప్ లోడ్ చేసే ఫిర్యాదుతో పాటు దానికి సంబంధించిన వీడియోలు గానీ ఫొటోలు గానీ కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని ఎలక్షన్ వింగ్ అధికారులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన వెంటనే స్పాట్‌కు స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్‌లు చేరుకుని యాక్షన్ తీసుకునే ఇటీవలే టీమ్‌ల సంఖ్యను కూడా పెంచినట్లు సమాచారం.

Next Story

Most Viewed