రిజర్వేషన్‌లు రద్దు చేస్తామంటే చెప్పుతో ఉరికించి కొట్టండి : బండి సంజయ్

by Disha Web Desk 23 |
రిజర్వేషన్‌లు రద్దు చేస్తామంటే చెప్పుతో ఉరికించి కొట్టండి : బండి సంజయ్
X

దిశ,హుజురాబాద్ రూరల్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే వాళ్లను చెప్పు, చీపుర్లతో తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను కొనాలనుకుంటున్నారని చెప్పారు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే... మీకు నోటీసులు వచ్చే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు. 300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం ఎట్లా సాధ్యమని ప్రశ్నించిన బండి సంజయ్ ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు హాజరైన ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ...కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. మే 13న పువ్వు గుర్తుపై ఓటేస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బాక్సులు బద్దలు కావాలే... కాంగ్రెస్ నన్ను ఓడగొట్టడానికి బి.సంజయ్ అనే వ్యక్తిని బరిలో దింపి కాలీ ఫ్లవర్ గుర్తు ఇప్పిస్తామని మాయ మాటలతో మభ్యపెట్టిందని మండిపడ్డారు.కాంగ్రెస్ నేతలకు బుద్ది లేదని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్ అని ఎన్నడైనా మీ వద్దకొచ్చారా? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డును ఎందుకు విస్తరించలే? నేనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు పోయి రోడ్డు మరమ్మతుల కోసం నిధులు తేవడమే కాకుండా రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.2 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చి ప్రధానితో పనులు ప్రారంభింప జేశానన్నారు. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు నేనే నిధులు మంజూరు చేశానని తెలిపారు .కాంగ్రెస్ అభ్యర్ధిని ఆ పార్టీ కార్యకర్తలే ఎవరైనా గుర్తు పడతారా? అసలు ఆయన లోకలా? నాన్ లోకలా? కూడా ఎవరికీ తెల్వదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో టిక్కెట్ తెచ్చుకుని ఆ పైసలను పంచి గెలవాలని చూస్తున్నరని పేర్కొన్నారు.బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేను రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినాని రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా పోరాడనో మీకు తెలుసన్నారు.150 రోజులు పాదయాత్ర చేసినని, బండి సంజయ్ కు ఓటేస్తే మీ ఓటుకు విలువ తెచ్చానని అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని బండి సంజయ్ ఏం చేసిండని అంటున్నాడని ఆయనకు తెల్వదేమో. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చిందిన్నారు. నేనడుగుతున్నా... జమ్మికుంటకు వచ్చి ప్రధానిని తిట్టి, నన్ను కూడా గుండు అని అన్నావ్ గాడిద గుడ్డు అన్నవ్. నా మీద, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ద 6 గ్యారంటీల అమలుపై ఎందుకు మాట్లాడలేదు? వాటిని ఎందుకు అమలు చేయలేదు? ఇవి మాట్లాడకుండా తిట్టడమే పనిగా పెట్టుకుంటే జనం నమ్ముతారా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి గత ఐదేళ్లలో మీ కాంగ్రెస్ నేతలు చేసిన పోరాటాలేమైనా ఉన్నాయా? నేను అన్ని వర్గాల పక్షాన కొట్లాడినాని, వందల కేసులు పెట్టినా భయపడలేదన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ ను ఏం చేస్తారు? మహిళలకు నెల నెలా రూ.2500 లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానన్నారని,రైతులకు రూ.15 వేలు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వడ్లకు రూ.500 బోనస్, తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస ధరకు కుంటామన్నారని మరి ఎందుకు వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు .2 లక్షల రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేసి మాయ మాటలు చెబుతున్నడని,నేను మాట్లాడితే దేవుడితో రాజకీయమంటారని,మరి రేవంత్ చేస్తుందేమిటని అన్నారు. రైతులకు ఎరువుల పేరుతో ఎకరాకు రూ.20 వేల చొప్పున సబ్సిడీ ఇస్తుందెవరు? మళ్లీ మోదీ ప్రధాని కాకపోతే రైతులపై పెద్ద ఎత్తున భారం పడుతుందని హెచ్చరించారు. మోదీతో దేశ రక్షణతో పాటు,ఆపదలో ఆదుకునే వ్యక్తి మోదీ అని,పేదలను ఆదుకోవాలంటే మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.

రేవంత్ రెడ్డికి సీఎం సీటు పోతుందని భయం పట్టుకుందని, ఎంపీ సీట్లు రాకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నడని,ఆ బాధతోనే మోదీని తిడుతున్నడని అన్నారు.మోడీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్దాలు చెబుతున్నడని, ఎవడైనా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే... చెప్పు, చీపుర్లతో తరిమితరిమి కొట్టండని అన్నారు.సిగ్గుండాలే... ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అని,సిగ్గు లేకుండా మేం మత రిజర్వేషన్లు ఇవ్వలేదని, కుల రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారని బొంకుతోందన్నారు. మేం మళ్లా చెబుతున్నమని, రిజర్వేషన్లను కొనసాగించి తీరుతాం అన్నారు.మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లను కొనసాగిస్తామని ప్రకటించారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తది? ఆ పార్టీ పోటీ చేసేదే 300 సీట్లు దాటడం లేదని, అధికారం కావాలంటే 275 సీట్లు కావాలని,మరి అధికారం ఎట్లా సాధ్యమన్నారు. అసలు కాంగ్రెస్ కు ఎవరిని చూసి ఓటేయాలని,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరన్నారు. అసలు మీకు అభ్యర్ధులే కరువైనరని,ప్రధాని అభ్యర్ధే లేరని, మరి ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే నని అన్నారు.

Next Story

Most Viewed