హిందూ రిజర్వేషన్‌లను ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్సే..: జేపీ నడ్డా

by Disha Web Desk 23 |
హిందూ రిజర్వేషన్‌లను ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్సే..: జేపీ నడ్డా
X

దిశ ,పెద్దపెల్లి ప్రతినిధి : దళిత, ఆదివాసీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లీంలకు ఎలా కట్టపెట్టిందో ఆ పార్టీ మేనిఫెస్టో చూస్తే కాంగ్రెస్ నిజస్వరూపం తెలిసిపోతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కి మద్దతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎం ఐ ఎం పార్టీలపై పదునైన విమర్శలు చేశారు. బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. మతపరమైన రిజర్వేషన్లు చేయరాదని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని, ఆయినా ముస్లీంలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి విఫలం ఆయిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి చట్టం చేసి మరీ నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేసిన రజాకర్ పార్టీగా కాంగ్రెసు ను నడ్డా అభివర్ణించారు. ముస్లీంలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఎవరి కోటా నుంచి ఇచ్చారని ప్రశ్నించారు. కర్ణాటకలో సైతం ఇదేవిధంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముస్లింలకు రిజర్వేషన్లు ప్రకటించినట్లు తెలిపారు. తాము తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన వెంటనే మతపరమైన రిజర్వేషన్స్ ఎత్తేస్తామని స్పష్టం చేశారు.

ఆర్థికమైన శక్తిగా భారత్..

మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని 8శాతం జీడీపీతో 5వ స్థానానికి చేరుకుందన్న ఆయన, ఆటోమోబైల్, ఫార్మా రంగాల్లో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందిస్తున్నట్లు తెలిపారు. మేడ్ ఇన్ చైనా నుండి మేడ్ ఇన్ ఇండియా వస్తువులను తయారు చేసుకునే స్థాయికి భారత్ పయనించడం చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. హిర పేరుతో దేశంలో 56వేల కిలోమీటర్ల రహదారులు, 52వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల విద్యుదీకరణ, 26 వేల కిలోమీటర్ల ఇంటర్నెట్ లైన్ల విస్తరణ, 2 లక్ష గ్రామాల్లో సీఎస్సీ సెంటర్ల ఏర్పాటు వంటి వాటిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు.

25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి..

ప్రధాని అన్న యోజన పథకంలో భాగంగా అయిదేళ్ళుగా 80 కోట్ల ప్రజలకు ఉచితంగా బియ్యం, పప్పులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్న నడ్డా 25 కోట్ల మంది నిరుపేదలను పేదరికం నుంచి విముక్తి చేయడం జరిగిందని తెలిపారు. మోదీ ప్రభుత్వం చెప్పిందే కాదు చెప్పనివి కూడా చేసి చూపెడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వమని ఆయన అన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్దులకు కూడా అయుష్మాన్ భారత్ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. 4 కోట్ల రెండు పడకల గదుల నిర్మాణం చేశామని, రాబోయే ఐదేళ్లలో మరో మూడు కోట ఇళ్ళను నిర్మిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కె సి ఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రజలకు అందించడం లో విఫలం అయ్యారని ఆగ్రహించారు.

అవి రజాకర్ పార్టీలే..

కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రజాకర్ల ఎజెండాను అమలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తబ్లిగీ జమాతే చెప్పినట్టు చేయడం మూడు పార్టీలకు శిరోధార్యం అయ్యిందని, వీరంతా రజాకర్ల మద్దతుదరులేనని దుయ్యబట్టారు. శ్రీరాముడిని ద్వేషించడం, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం, దేశ ద్రోహులకు టికెట్లు ఇవ్వడం వీరి దేశభక్తిని తెలియజేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పార్టీలకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

జగదల్పూర్-పెద్దపల్లి-నిజామాబాద్ రోడ్డు..

జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వెస్తునన్న నడ్డా 450 కిమి విస్తీర్ణం గల జగదల్పూర్-పెద్దపల్లి-ధర్మపురి-నిజామాబాద్ జాతీయ రహదారిని త్వరలో పూర్తి చేతామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణాకు మూడు వందేభారత్ రైల్లు, భారతమాలా పేరుతో 5కారిడార్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిచి స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన చేశమన్నారు. అంతకుముందు ఆయన భారతరత్న, భారత మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావును ఆయన స్మరించారు.

కదిలివచ్చిన కాషాయ సైన్యం..

పెద్దపల్లి పార్లమెంటు సీటులో విజయావకాశాలు అధికంగా ఉండటంతో అధిష్టానం ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టిని సారించింది. జాతీయ అధ్యక్షుడి హోదాలో నడ్డా మొదటిసారి పెద్దపల్లికి రానుండటంతో పెద్ద ఎత్తున జనాలను సభకు తరలించారు. అన్ని గ్రామాల నుండి కాశాయ సైనికులు భారీగ తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా జైశ్రీరామ్, భారత్ మాతా కీ జై, మోదీమోదీ నినాదాలతో దద్దరిల్లింది. ఈ బహిరంగ సభలో పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, దళిత మోర్చా ఉపాధ్యక్షుడు ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్సి రామచంద్రారెడ్డి, పార్లమెంటు ప్రభారి నరేందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, రమేష్, చంద్రుపట్ల సునీల్ రెడ్డి, ఎర్రబెల్లి రఘునాథ్ రెడ్డి, సత్యనారాయణ, గీత, రాంరెడ్డి, కందుల సంధ్యారాణి, కొయ్యల ఏమాజీ తదితరులు హాజరయ్యారు.

Next Story

Most Viewed