ముంచుకొస్తున్న ‘పోలింగ్’ డెడ్‌లైన్.. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్..!

by Disha Web Desk 19 |
ముంచుకొస్తున్న ‘పోలింగ్’ డెడ్‌లైన్.. జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ పోలింగ్‌కు ఇక మిగిలింది ఐదురోజులే కావడంతో బీఆర్ఎస్ మరింత స్పీడ్ పెంచింది. రోడ్ షోలు, సమావేశాలతో పాటు మరోవైపు కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తుంది. పార్టీ అధినేత కేసీఆర్, లీడర్లు కేటీఆర్, హరీష్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కేడర్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారికి పూర్తిస్థాయిలో సపోర్టు రావడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. దీంతో గెలుపుపై ఇంకా కొంత అనుమానమే నెలకొంది.

జనాన్ని ఆకర్షించేలా చర్యలు

పోలింగ్‌కు 5 రోజులు మాత్రమే ఉండటంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు‌లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ తమదైన శైలీలో పాలకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా ప్రత్యర్థి అభ్యర్థులపై మాటలతో విరుచుకుపడుతున్నారు. మరోవైపు కులసంఘాలతోనూ ఆత్మీయ సమ్మేళనాలు, పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతోనూ భేటీ అవుతున్నారు. గత ప్రభుత్వ పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ సపోర్టు చేయాలని కోరుతున్నారు. ప్రతిరోజూ రెండు మూడు రోడ్ షోలలో పాల్గొంటూ కేడర్ అంతా పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలను సైతం బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా తమదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారు.

ఆశించిన మేరకు లభించని మద్దతు..

లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కేడర్ నుంచి ఆశించిన మేరకు పోటీ చేసే అభ్యర్థికి సపోర్టు రావడం లేదని సమాచారం. భువనగిరి, నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఇలా మరికొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో కేడర్ కలిసి రావడం లేదని తెలుస్తోంది. అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓడిన అభ్యర్థులకే ఆ నియోజకవర్గంలో బాధ్యతలు అప్పగించడంతో కేడర్‌తో పాటు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్ కర్నూల్ ఎంపీ సెగ్మెంట్‌లో ప్రచారంలో భాగంగా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లె గ్రామంలో ప్రచారం చేస్తుండగానే గ్రామస్తులు అడ్డుకున్నారు. నిలదీశారు. ఎన్నికలకు ముందు ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగానే భూములు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పలు నియోజకవర్గాల్లో కొనసాగుతున్నట్టు సమాచారం.

పవర్‌లో ఉన్నపుడు కేడర్‌ను పట్టించుకోలే..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి బీఆర్ఎస్ దాదాపుగా 40 రోజులు దాటింది. అన్నివర్గాలతోనూ భేటీ అవుతున్నారు. సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ గెలుపుపై అభ్యర్థులు కొంత అనుమానమే వ్యక్తం చేస్తున్నారు. కేడర్ పూర్తిస్థాయిలో కలిసి రావడం లేదని పార్టీ అభ్యర్థులే అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధిష్ఠానం కిందిస్థాయి నేతలను గుర్తించకపోవడం, పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడం, కమిటీలు సైతం ఏర్పాటు చేయకపోవడం, గ్రూపులపై ఫోకస్ పెట్టలేదు. దీంతో కేడర్, సెకండ్ స్థాయి నేతలూ అసంతృప్తితోనే ఉన్నారు. అయినప్పటికీ ఎంపీ అభ్యర్థులు మాజీ ప్రజాప్రతినిధులపై ఆధారపడ్డారు. వారిపై ఇప్పటికే వ్యతిరేకత ఉండటంతో కేడర్ పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని సమాచారం. దీంతో ఎంపీ అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed