కాంగ్రెస్ జమానా అంతా మోసం, అవినీతే.. జేపీ నడ్డా ఫైర్

by Disha Web Desk 19 |
కాంగ్రెస్ జమానా అంతా మోసం, అవినీతే.. జేపీ నడ్డా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జమానాలో అంతా అవినీతి ఉండేదని, నిర్ణయాత్మక విధానాలు అమలు చేసే స్థితిలో కూడా కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అబద్ధపు వాగ్ధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియా, అపరాధులను రక్షించడమే కాకుండా కాంగ్రెస్ చేసిన అవినీతి రాజకీయం తమకు గుర్తు ఉందన్నారు. మోడీ వచ్చాక పదేండ్లలో అవినీతిని తొక్కి పెట్టి దేశాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రధాని ఆవాస్ యోజనను కేసీఆర్ అమలవ్వకుండా అడ్డుకున్నారని, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఏ అంటే ఎఐఎంఐఎం, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని.. ఈ మూడు పార్టీలు ముస్లింల ఎజెండాతో ముందుకు వెళ్లే పార్టీలని చురకలంటించారు. ఈ పార్టీలు తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయని.. రజాకార్ పాలనను సమర్థించే పార్టీలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ పార్టీలు నిర్వహించవని, కేంద్రంలో మళ్లీ బీజేపీని గెలిపిస్తే తెలంగాణ విమోచనాన్ని ధూం ధాంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మోడీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ అంటున్నాడు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు రాహుల్ గాంధీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అని, నిరుపేదలను అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు.

పేద ప్రజలను నిలువునా మోసం చేసి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నిరుపేదల సంక్షేమాన్ని ఎన్నటికీ కోరుకోదని విమర్శలు కురిపించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించబోమనే విషయాన్ని లిఖితరూపంలో ఇచ్చే దమ్ముందా..? అని ప్రధాని మోడీ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌ను ప్రశ్నించాడని, కానీ దీనిపై కాంగ్రెస్ ఇప్పటి వరకు స్పందించకుండా సైలెంట్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాముడిని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకించే పార్టీ అని ఫైర్ అయ్యారు. రాముడి ఇతిహాసానికి సంబంధించిన ఆధారాలు లేవని గతంలో సోనియా సర్కార్ చెప్పలేదా అని ప్రశ్నించారు.

ఉదయనిధి స్టాలిన్ అంటాడు.. సనాతన ధర్మం హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూ అని, దీనిపై సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ స్పందించరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే రాహుల్ జేఎన్‌యూలో దేశాన్ని ముక్కలు చేస్తామని నినాదించే వారి తరుపున నిలబడ్డాడని, ఎయిర్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన ఆధారాలు అడిగిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. అలాంటి వారికి అధికారమిస్తే దేశం పరిస్థితి ఎలా అవుతుందో మీరే అర్థం చేసుకోండని విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధికి పాటు పడుతోన్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Next Story

Most Viewed