ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటున్న కమిన్స్.. తెలుగు డైలాగ్స్‌తో అదరగొట్టిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్

by Dishanational5 |
ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటున్న కమిన్స్.. తెలుగు డైలాగ్స్‌తో అదరగొట్టిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుస విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) జట్టు అదరగొడుతోంది. గత సీజన్‌ వరకు 150 స్కోరునే అతి కష్టంమీద సాధించే స్థితిలో ఉండే ఎస్ఆర్‌హెచ్.. ఈసారి 250కి మించిన భారీ స్కోర్లు సాధిస్తూ సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వరుస విజయాల వెనుక ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతోపాటు జట్టు కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ పాత్ర కూడా ఎంతో కీలకమైనదిగా ఉందనేది కాదనలేనిది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ అభిమానుల్లో కమిన్స్ పేరు మారుమోగుతోంది. దీంతో వారిని అలరించేందుకు తెలుగులోని ఫేమస్ డైలాగులతో ముందుకొచ్చాడు కమిన్స్. ఈ మేరకు జట్టు యాజమాన్యం బుధవారం ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కమిన్స్ ఎలాంటి తడబాటు లేకుండా తెలుగు డైలాగ్‌లు చెప్పడం చూడొచ్చు. ‘‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’’, ‘‘కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్.. ఊరమాస్’’, ‘‘ఎస్ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ’’ అనే డైలాగ్స్‌తో అదరగొట్టిన కమిన్స్.. చివర్లో మెడపై చేయి పెట్టుకునే పవన్ కళ్యాణ్ మ్యానరిజంతో వీడియోను ముగించాడు. వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘కమిన్స్ మామా.. నువ్వ కేక’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్.. ఐదింట్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ వేదికగా గురువారం బెంగళూరుతో తలపడనుంది.



Next Story