రాందేవ్‌బాబా ‘పతంజలి’ ఇంకో‘సారీ’.. ఏం చేసిందంటే.. ?

by Dishanational4 |
రాందేవ్‌బాబా ‘పతంజలి’ ఇంకో‘సారీ’.. ఏం చేసిందంటే.. ?
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి ఆయుర్వేద సంస్థ గతంలో పత్రికా ప్రకటనలు ఇచ్చిన కేసులో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సుప్రీంకోర్టుకు బహిరంగ క్షమాపణలు తెలుపుతూ పతంజలి ఆయుర్వేద సంస్థ వరుసగా రెండోరోజు (బుధవారం) కూడా వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనల్లో పతంజలి కంపెనీ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా , సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణలు సుప్రీంకోర్టును క్షమాపణలు వేడుకుంటున్నట్లుగా సందేశం ఉంది. కోర్టుకు క్షమాపణలు తెలుపుతూ మంగళవారం రోజు న్యూస్ పేపర్లలో పతంజలి కంపెనీ ఇచ్చిన ప్రకటనల సైజు చిన్నగా ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో కాస్త పెద్దసైజులో బుధవారం రోజు కూడా పతంజలి కంపెనీ క్షమాపణల యాడ్స్‌ను ప్రచురించింది.

కోర్టుకు, ఐఎంఏకు యాడ్స్ వివరాలు ఇవ్వనున్న ‘పతంజలి’

మంగళవారం రోజు సుప్రీంకోర్టులో పతంజలి గ్రూపు తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కోర్టును క్షమాపణలు కోరుతూ మంగళవారం ఉదయం దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో పతంజలి కంపెనీ యాడ్స్ ఇచ్చిందని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘క్షమాపణల యాడ్స్‌లో పదాలకు ఏ సైజు వాడారు ? గతంలో మీ ఉత్పత్తుల గురించి తప్పుడు ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగించిన సైజునే వాడారా?’’ అని ప్రశ్నించింది. దీంతో బహిరంగ క్షమాపణలను పెద్ద సైజులో మరోసారి ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మరోసారి వార్తాపత్రికల్లో క్షమాపణలను పతంజలి గ్రూప్ పబ్లిష్ చేసింది. పత్రికల్లో వచ్చిన బహిరంగ క్షమాపణల ప్రకటనల వివరాలను కోర్టుకు, పిటిషనర్లకు(ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌) పతంజలి కంపెనీ అందజేయనుంది. ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్‌ 30న జరగనుంది. ఆధునిక వైద్యవిధానాలపై పతంజలి గ్రూప్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లోనే పతంజలి గ్రూప్‌ను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో పతంజలి గ్రూప్ కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.



Next Story

Most Viewed