‘మహిళా డాక్టర్లు చికిత్స చేస్తే రోగులు వేగంగా కోలుకోవడం, బ్రతికే అవకాశం ఎక్కువ’

by Disha Web Desk 17 |
‘మహిళా డాక్టర్లు చికిత్స చేస్తే రోగులు వేగంగా కోలుకోవడం, బ్రతికే అవకాశం ఎక్కువ’
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒక మహిళా డాక్టర్ చికిత్స చేసినప్పుడు రోగులు తొందరగా కోలుకోవడంతో పాటు చనిపోయే అవకాశం తక్కువగా ఉందని ఒక అధ్యయనం పేర్కొంది. ఇటీవల అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ఒక నివేదికను ప్రచురించారు, దాని ప్రకారం మహిళా డాక్టర్లతో పోలిస్తే, పురుష డాక్టర్లు రోగులకు చికిత్స చేసినప్పుడు వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుండటంతో పాటు, రోగి మరణించే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని అధ్యయనం తెలిపింది.

2016 నుండి 2019 వరకు ఆసుపత్రిలో చేరిన 458,100 మంది మహిళా రోగులు, 318,800 కంటే ఎక్కువ మంది పురుష రోగులతో సహా మొత్తం 7,76,000 మందిపై సర్వే చేశారు. వీరిలో మహిళా వైద్యులు చికిత్స చేసినప్పుడు రోగులు తక్కువ మరణాలతో పాటు, వేగంగా కోలుకున్నారని అధ్యయనంలో తేలింది. మహిళా వైద్యుల నుంచి చికిత్స పొందిన మహిళా రోగుల మరణాల రేటు 8.15 శాతం ఉండగా, పురుష డాక్టర్లు చికిత్స చేసినప్పుడు వారిలో మరణాల రేటు 8.38 శాతంగా నమోదైంది. అలాగే ఒక మహిళా డాక్టర్ చికిత్స చేసినప్పుడు పురుషు రోగులలో మరణాల రేటు 10.15 శాతం ఉండగా, ఒక పురుష డాక్టర్ చికిత్స చేసినప్పుడు 10.23 శాతంగా ఉంది.

మహిళా డాక్టర్లు, పురుష డాక్టర్లు చికిత్స అందించే సమయంలో భారీ వ్యత్యాసం ఉందని నివేదిక పేర్కొంది. మహిళా వైద్యులు తమ రోగులతో మాట్లాడటం, వారి రికార్డులను చూడటం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని నిపుణులు తెలిపారు. రోగులతో మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండటం, ఎక్కువ సంరక్షణను అందించడం వలన మహిళా డాక్టర్ల నుంచి చికిత్స తీసుకున్నట్లయితే రోగులు వేగంగా కోలుకుంటున్నారని, అలాగే వారు మరణించే శాతం కూడా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది.

ముఖ్యంగా మహిళా రోగుల విషయానికి వస్తే మహిళా డాక్టర్ల నుంచి చికిత్స పొందడం వల్ల సున్నితమైన పరీక్షల సమయంలో మహిళా రోగులకు తలెత్తే ఇబ్బంది, అసౌకర్యాలను తగ్గించడానికి కూడా వీలవుతుందని పరిశోధకులు తెలిపారు. పురుష డాక్టర్లతో పోలిస్తే మహిళా డాక్టర్లు రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. వారికి చికిత్స అందించడంలో కానీ, వారితో కమ్యూనికేషన్ కొనసాగించడంలో వైద్య పరిశ్రమలో స్త్రీలు పురుషుల కంటే ఉన్నత స్థాయిని కలిగి ఉన్నారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.



Next Story

Most Viewed