మనం కంట్రోల్ చేయలేని ప్రతిచర్యలకు శరీరం ఎందుకు రియాక్ట్ అవుతుంది?.. నిపుణులు ఏం చెప్తున్నారు?

by Dishafeatures2 |
మనం కంట్రోల్ చేయలేని ప్రతిచర్యలకు శరీరం ఎందుకు రియాక్ట్ అవుతుంది?.. నిపుణులు ఏం చెప్తున్నారు?
X

దిశ, ఫీచర్స్ : మనం ఇంట్లో ఉన్నప్పుడో, బయట నడుస్తున్నప్పుడో ఏదైనా ఒక వస్తువు కింద పడిపోతున్నట్లు గమనిస్తే వెంటనే ప్రతిస్పందిస్తాం. అకస్మాత్తుగా మన శరీరంలో కదలిక ప్రారంభం అవుతుంది. ఆ వస్తువును పట్టుకోవడమో, భయపడి పారిపోవడమో చేస్తాం. కొన్నిసార్లు మనం ఏమీ తినకపోయినా వెక్కిళ్లు వస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో ఒళ్లు గగుర్పాటుకు గురయ్యే ఆకస్మిక చర్యలు కూడా ఇటువంటి అనుభవాలను కలిగిస్తుంటాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది? మన శరీరం మనం నియంత్రిచలేని రియాక్షన్స్‌ను ఎందుకు కలిగి ఉంది?. ఏయే సందర్భాల్లో ఎటువంటి ప్రతిచర్యలను ఎదుర్కొంటాం.. దీనిపై స్టడీ చేసిన నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

ఉల్లిపాయలు తరిగేటప్పుడు

ఉల్లిపాయలు కోసేటప్పుడు అక్కడ ఉన్నవారు సహజంగానే ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే దాని ఘాటుకు కళ్లల్లో నీళ్లు వస్తాయి. దీనిని నియంత్రించడం సాధ్యం కాదు. కానీ మన శరీరంలో ఈ ప్రతి చర్య జరగడానికి ఒక కారణం ఉంది. ఆ సందర్భంలో ఉల్లిపాయలు ఒక వాయువును ఉత్పత్తి చేసే రసాయన పదార్థాన్ని విడుదల చేస్తాయి. అది కళ్లల్లోని ఇంద్రియ నాడులను కూడా ప్రభావితం చేయడంతో కళ్లల్లో నీళ్లు వస్తాయి.

గూస్ బంప్స్ ఎందుకు వస్తాయి?

ఏదైనా పాట విన్నప్పుడు, సన్నివేశం చూసినప్పుడు, చలిలో వణుకుతున్నప్పుడు ఒళ్లు గగుర్పాటుకు గురైంది లేదా గూస్ బంప్స్ తెప్పించింది అంటుంటారు. ఎమోషనల్ రెస్పాన్స్‌ అనుభవించిన సందర్భాల్లో ఇలా జరుగుతుంది. వాస్తవానికి గూస్ బంప్స్ అనేవి చల్లగా ఉన్న అనుభూతిని తగ్గించడానికి, మెదడు మన శరీరంలోని చిన్న చిన్న వెంట్రుకలను ప్రేరేపిస్తుంది. మనం భయం లేదా సంతోషాన్ని అనుభవించినప్పుడు కూడా అదే జరుగుతుంది.

ఎక్కిళ్లు రావడానికి కారణం

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయనే దానితో సంబంధం లేకుండా అవి ఇబ్బందికరంగా ఉంటాయనేది మాత్రం మనకు తెలిసిందే. ఇవి ఎందుకు వస్తాయనేది నిపుణులకు ఇప్పటికీ ఒక సవాలుగానే ఉంటోంది. అయితే మెడికల్ న్యూస్ టుడే ప్రకారం.. అవి మెదడులోని నాడీ మార్గాలలో ఆటంకం ఏర్పడటంవల్ల సంభవించవచ్చు. ఇక నిరంతరం ఎక్కిళ్లు వస్తుంటే గనుక మెదడు, వెన్నుపాము లేదా ఛాతీ గోడలో సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. కాబట్టి ఇబ్బందికరమైన ఎక్కిళ్లు వస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం బెటర్.

శరీరంలో తిమ్మిరి పట్టడం

ఎక్కువసేపు కూర్చొని లేవగానే కొన్నిసార్లు వెంటనే నడవడానికి ఇబ్బంది అనిపిస్తుంది. ఈ పరిస్థితినే పలువురు కాళ్లు తిమ్మిరి పట్టినట్లు చెప్తుంటారు. అయితే ఇలా జరగడం అరుదుగా కొన్ని సందర్భాల్లో బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే సంకేతం కావచ్చు లేదా ఆ వ్యక్తి శరీరంలో పొటాషియం, కాల్షియం మెగ్నీషియం రిలేటెడ్ మినరల్స్ లోపం కావచ్చు. వ్యాయామం చేస్తున్నప్పుడు, అధికంగా చెమట బయటకు పోయినప్పుడు ఇలా జరిగితే వెంటనే అలర్ట్ అల్వాలి.

కళ్లు అదరడం లేదా కొట్టుకోవడం

మనకు తెలియకుండానే కొన్నిసార్లు కనురెప్పలు కొట్టుకుంటాయి. మెలికలు తిరిగిన అనుభూతి కలుగుతుంది. హెల్త్ లైన్ ప్రకారం.. అలసట, ఒత్తిడి, ఆల్కహాల్ లేదా కెఫిన్‌ అధికంగా సేవించడం వల్ల ఇలా జరగవచ్చు. కళ్లు అదరడం అనేది ప్రమాదకరమైన విషయం కాదు. వాటంతట అవే ఆగిపోతాయి.

ఆవలింతలు దేనికి సంకేతం?

మన శరీరం కంట్రోల్ చేయలేని ప్రతిచర్యల్లో ఆవలింతలు ఒకటి. వాటిని ఆపడం సాధ్యం కాదు. అలాగే మన ఎదురుగా ఉన్నవాళ్లు ఆవలిస్తే కూడా మనకు ఆవలింతలు వస్తుంటాయి. సాధారణంగా ఇవి మనం అలసిపోయాం అనడానికి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. వృద్ధులకంటే యువతలో ఈ ఆవలింతల ప్రతిస్పందనా చర్యలు ఎక్కువగా ఉంటాయి.

శరీరంలో సూదిపోటు

అనుకోకుండా మన శరీరంపై ఏదో ఒక భాగంలో ఎవరో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. క్షణాల్లో తగ్గిపోతుంది. అలా జరగడాన్ని మనం నియంత్రించలేం. దీనిని ‘టెంపరరీ పరేస్తేసియా’ అని కూడా పిలుస్తున్నారు సైంటిస్టులు. శరీరంలోని నరాలపై అధిక ఒత్తిడి కలగడంవల్ల ఈ ఆకస్మిక అనుభూతి తలెత్తుతుంది.

ఆసంకల్పిత ప్రతిస్పందనలు

అనేక పరిస్థితుల్లో మనం అసంకల్పితంగా ప్రతిస్పందిస్తుంటాం. ఉదాహరణకు మన కళ్ల ఎదుట ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావించగానే ఇలా చేస్తుంటాం. నిపుణుల ప్రకారం ఈ రిఫ్లెక్స్‌లు లేదా ప్రతి చర్యలు మెదడు ద్వారా ప్రాసెస్ చేయబడవు. స్వయంచాలకంగా వెంటనే పుట్టుకొస్తాయి. ప్రేరేపిత గ్రాహకాలు వెన్నుపాముకు సంకేతాలను పంపినప్పుడు, మొదట మెదడులో ప్రాసెస్ చేయవలసిన అవసరం లేకుండానే మోటార్ న్యూరాన్స్ యాక్టివ్ అవడంవల్ల ఈ అసంకల్పిత ప్రతిచర్యలు ఏర్పడతాయి.

Next Story

Most Viewed