ప్రోటీన్ పౌడర్లలో విషపదార్థాలు.. అందం, ఆరోగ్యం కోసమంటూ వాడితే లివర్, బ్రెయిన్‌‌పై హానికర ప్రభావం..

by Dishafeatures2 |
ప్రోటీన్ పౌడర్లలో విషపదార్థాలు.. అందం, ఆరోగ్యం కోసమంటూ వాడితే లివర్, బ్రెయిన్‌‌పై హానికర ప్రభావం..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో ఏవి మంచివో, ఏవి కల్తీవో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే బ్రాండెడ్ అని, ఆరోగ్యకరమని, పరిశుభ్రతకు మారుపేరని చెప్తున్న పలు ఉత్పత్తులు కూడా పరిశోధనల్లో కలుషితమైనవని తేలుతున్నాయి. ఆ మధ్య బోర్న్ విటా, సెరెలెక్స్‌లో హానికరమైన మెటల్స్ ఉంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ప్రజెంట్ పిల్లలు మొదలు కొన్ని పెద్దల వరకు ఆరోగ్యానికి మంచిదని వాడుతున్న ప్రోటీన్ పౌడర్లు, పానీయాలు సురక్షితమైనవి నిపుణులు అంటున్నారు.

పిల్లలు త్వరగా పెరగాలని పేరెంట్స్ ప్రోటీన్ పౌడర్లను ఆహార పదార్థాల్లో కలిపి తినిపిస్తుంటారు. ఇంకొందరు పెద్దలు, యువతీ యువకులు, అథ్లెట్స్ బాడీ ఫిట్‌నెస్ కోసమంటూ వాటిని యూజ్ చేస్తుంటారు. పలువురికి పొద్దున్నే ప్రోటీన్ డ్రింక్స్ తాగే అలవాటు కూడా ఉంటుంది. ఈ హాబిట్స్ మీలో ఉంటే గనుక వెంటనే మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి హాని చేస్తాయని జర్నల్ ఆఫ్ మెడిసిన్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా 70 శాతం ప్రోటీన్ పౌడర్లలో పెస్టిసైడ్స్ ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధ్యయనంలో భాగంగా కేరళలోని ఒక ఫేమస్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు, యూఎస్‌కు చెందిన పలువురు పరిశోధకులతో కలిసి ప్రోటీన్ పౌడర్లు ఏ విధంగా ఉపయోగపడతాయో పరిశీలించారు.

స్టడీలో భాగంగా మొత్తం 36 రకాల ప్రోటీన్ సప్లిమెంట్స్‌ను పరిశోధకులు పరీక్షించారు. కాగా వీటిలో 70 శాతం వరకు విషపదార్థాలతో కలుషితమై ఉన్నట్లు గుర్తించారు. అలాగే పలు బ్రాండ్లు, వాటి ఉత్పత్తులపై పేర్కొన్న విధంగా కాకుండా ప్రోటీన్ కంటెంట్‌‌లో సగం మాత్రమే అందిస్తున్నట్లు గమనించారు. మరికొన్నింటిలో నాణ్యతలేని ప్రోటీన్లను, అలాగే 14 శాతం నమూనాలలో ఆరోగ్యానికి హానిచేయగల ఫంగల్ అఫ్లాటాక్సిన్స్, మరో ఎనిమిది శాతం ప్రోటీన్ పౌడర్లలో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నట్లు కనుగొన్నారు.

కొన్ని రకాల బ్రాండ్లలో అయితే లెడ్ పర్సంటేజ్ 75 శాతం, ఆర్సెనిక్ 13 శాతం, కాడ్మియం 27.8 శాతం ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ఇవన్నీ మానవ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని, హెపాటో టాక్సిసిటీ అనే లివర్ సంబంధిత వ్యాధికి కారణం అవుతాయని వెల్లడించారు. అంతేకాకుండా హానికరమైన విషపదార్థాలు కలిగి ఉండటంవల్ల అవి మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, పిల్లల్లో ఎదుగుదలను అడ్డుకుంటాయని పేర్కొన్నారు.

అనేక బ్రాండ్లకు సంబంధించిన ప్రోటీన్ పౌడర్లలో హై షుగరింగ్ కంటెంట్ కలిగి ఉండటంవల్ల ఒబేసిటీ, డయాబెటిస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌కు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే సుక్రోలోజ్, అస్పర్టమై, సాచరిన్ వంటి ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ కూడా ఉండటంవల్ల ఇవన్నీ అనారోగ్యాలకు కారణం అవుతున్నాయి. కాబట్టి వినియోగదారులు ప్రత్యామ్నాయ పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రోటీన్ పౌడర్లు, పానీయాలు వాడాల్సి వస్తే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.



Next Story

Most Viewed