పాఠశాల విద్య గాడిన పడేనా?

by Disha edit |
పాఠశాల విద్య గాడిన పడేనా?
X

తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సామాజిక బాధ్యతగా విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో సూచిస్తూ ప్రతిపాదనలను నాటి ప్రభుత్వానికి సమర్పించారు. వాటిని ఆనాటి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం గురుకుల విద్యా వ్యవస్థను మాత్రమే ప్రోత్సహిస్తూ వచ్చింది. ఫలితంగా అప్పటికే కొనసాగుతున్న పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది.

ప్రభుత్వ అధికారిక లెక్కలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు మనకు కనబడుతున్నాయి.13,374 పాఠశాలల్లో 50 మంది లోపే పిల్లలు(PS,UPS,HS అన్ని కలిపి)5,821 బడుల్లో ఒకే టీచర్,1213 పాఠశాలలు జీరో బడులు(పిల్లలు లేనివి) ఉన్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా రంగం గాడి తప్పడానికి కారణాలుగా గత దశాబ్ద కాలంలో కేవలం గురుకులాలను ప్రోత్సహిస్తూ మిగతా బడులను నిర్లక్ష్యం చేయడం, మౌలిక సదుపాయాల కొరత, టీచర్ల కొరత, పర్యవేక్షణ లోపం, సత్ఫలితాలను ఇవ్వని పథకాల అమలు, ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు ఏర్పడిన అభిప్రాయం, బడులకు సరిపోయే బడ్జెట్ కేటాయించకపోవడం వంటివి ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ బడులకు ఆదరణ తగ్గి ప్రతి ఏటా జీరో బడులు పెరుగుతున్నాయి.

విద్యారంగ కేటాయింపులు తక్కువే!

తెలంగాణ రాష్ట్రంలో పదిమంది విద్యార్థులకి 8 మంది టీచర్లు ఉన్నారని, 130 మంది విద్యార్థులకు ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారని తరచూ వార్తాపత్రికల్లో ఇలాంటి కథనాలు మనం చూస్తున్నాం. ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అయా జిల్లాలలోని మండలాన్ని యూనిట్‌గా చేసుకొని ఉపాధ్యాయుల సర్దుబాటు చేసి తాత్కాలికంగా ఉపాధ్యాయుల కొరతను విద్యాశాఖ తీర్చుతుంది. ఉపాధ్యాయులు అందుబాటులో లేని బడుల్లో విద్యా వాలంటీర్లను నియమిస్తుంది. కానీ దీనికి శాశ్వతమైన పరిష్కారంగా ఉపాధ్యాయుల నియామకాలు మాత్రం చేయలేదు.

తెలంగాణ రాష్ట్ర గత బడ్జెట్‌లో విద్యారంగానికి 6.24% నిధులు కేటాయించగా ఈ సారి ₹21,389 (7.75%) కోట్లు కేటాయించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 1.51% అధిక నిధులు విద్యారంగానికి కేటాయించారు. ప్రతి మండలానికి అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేస్తామని దానికి నిధులు కేటాయించడం సంతోషమే, కానీ ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలలకు మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాల్సి ఉంది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని టాప్ 20 రాష్ట్రాలలో తెలంగాణ తన బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యల్పంగా 7.75% నిధులను కేటాయించింది. ఢిల్లీ 21.1%, కర్ణాటక 11%, ఆంధ్రప్రదేశ్(12.6%), కేరళ(14%), తమిళనాడు(14.1%) రాష్ట్రాలు విద్యారంగా అభివృద్ధికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణకి అత్యధిక నిధులు కేటాయించాయి. ఆ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర విద్యారంగ కేటాయింపులు చాలా తక్కువ. రాబోయే రోజుల్లో విద్యారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది.

గాడి తప్పిన విద్యారంగం..

అలాగే ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపు కోసం ప్రతి సంవత్సరం వృత్యంతర శిక్షణలను ఇస్తూ, పర్యవేక్షణ అధికారులతో నిరంతరం పర్యవేక్షిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం లేని వారిని నియమిస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. జిల్లా, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులుగా బోధనా అనుభవం గల వారిని మాత్రమే నియమించాలి. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని విద్యార్థుల ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకోవాలంటే బోధనా అనుభవం ఉన్న అధికారులతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ చేయాలంటే రాష్ట్రస్థాయిలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, మేధావులు, ఉన్నతాధికారులు, అనుభవజ్ఞులైన టీచర్లతో విద్యా కమిషన్ ఏర్పాటు చేసి వారి సలహా, సూచనలతో విద్యారంగాన్ని పటిష్టపరుస్తూ పాఠశాల విద్యను సంక్షోభం నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధుల కేటాయింపు, మౌలిక సౌకర్యాల కల్పన, ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ నియామకాలు, పర్యవేక్షణ, ప్రైవేటు బడుల్లో ప్రభుత్వ వాటి పుస్తకాలు వాడేలా చర్యలు తీసుకోవాలి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గాడి తప్పిన పాఠశాల విద్యారంగాన్ని కాపాడుతుందని ఆశిద్దాం.

పాకాల శంకర్ గౌడ్

98483 77734

Next Story

Most Viewed