ప్రమాదంలో ప్రజాస్వామ్యం

by Disha edit |
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
X

దేశ స్వాతంత్ర్య చరిత్రలో ప్రజాస్వామ్య స్ఫూర్తిపై మునుపు ఎన్నడూ లేని చర్చ నేడు జరుగుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈ దేశ మౌలికమైన రాజకీయ అంశాలపై పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా ఉన్న లౌకిక, ప్రగతిశీల, భిన్న సంస్కృతులతో వర్ధిల్లుతూ భిన్నత్వంలో ఏకత్వం అన్న మూల సూత్రాల నుండి ఒక మత పెత్తనంలో ఒకే భావజాలంలో దేశాన్ని బల ప్రయోగం ద్వారా నిర్మాణం చేసే ఫాసిస్ట్ పద్ధతులను బీజేపీ అవలంబించడం దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారింది.

గత ప్రభుత్వ జీడీపీని అందుకోలేక..

ఏక సంస్కృతి నిర్మాణం పేరు మీద భిన్న సంస్కృతిలపై ఆచార వ్యవహారాలపై చివరికి వేల సంవత్సరాలుగా తన కంచంలో తింటున్న ఆహారపు అలవాట్లపై కూడా కర్ర పెత్తనం చేయడం అంతటితో ఆగక తనకు నచ్చని ఆహారాన్ని తింటున్నారన్న నెపంతో భౌతిక దాడులు చేయడం, హతమార్చడం లాంటి క్రూరమైన పనులకు కూడా బరితెగించడం దేశంలోని ప్రజా స్వామ్యానికి వచ్చిన పెను ప్రమాదంగా చెప్పవచ్చు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలోని అంతరార్థం బీజేపీ శక్తులకు అర్థమైనట్టు లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భిన్న ఆచారాలు సంస్కృతులు, స్వీయ అస్థిత్వాలతో నిండి ఉన్న ప్రాంతాలతో ఉన్న భారత ఉపఖండం అనేక షరతులతో ఒకేదేశంగా ఆవిర్భవించిందన్న చారిత్రక సత్యాన్ని మరిచిపోతే చరిత్ర క్షమించదు. ప్రశ్నించే శక్తులను, ప్రగతిశీల వాదులపై , భయంకరమైన చట్టాలను ప్రయోగిస్తూ దేశ ద్రోహుల ముద్ర వేస్తూ జైలుపాలు చేయడం కూడా ఘనత వహించిన మోడీ పాలనలో చూస్తున్నాం. ప్రభుత్వ వ్యవస్థల అన్నింటిని తన పార్టీ ప్రచార విభాగాలుగా మలుచుకొని తమకు గిట్టని వారిని బల ప్రయోగం చేయడం లాంటి దారుణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. గతంలో మన్మోహన్ సింగ్ పాలనలో ఉన్న జీడీపీని కూడా మోదీ ప్రభుత్వం అందుకోలేకపోయింది.

జాతి సంపద దోచిపెట్టి..

నేతలపై సీబీఐ, వ్యాపారవేతలపై ఈడీ కవులు, రచయిత, సామాజిక కార్యకర్తలపై ఊపా లాంటి చట్టాలతో ప్రభుత్వ మనుగడను కొనసాగిస్తున్నారు. తమ పార్టీ తీర్థం పుచ్చుకున్న అక్రమార్కులను మాత్రం రక్షిస్తూ దేశంలొనే అతిపెద్ద వాషింగ్ మిషన్‌ను బీజేపీ కలిగి ఉన్నదన్న వ్యంగ్య అస్త్రాలను బీజేపీ తన పాలన కాలమంతా విమర్శలను మూటగట్టుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లు వ్యవహారంతో బీజేపీ కుహన భావజాలంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిన తీరు బహిర్గతం అయ్యింది. కార్పొరేట్ శక్తులతో మిలాకత్ అయ్యి దేశ సంపదను,అదానీ, అంబానీలకు ఎలా పంచిపెట్టిందో బహిర్గతం అయింది. జాతి సంపదగా ఉన్న సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల ధారాదత్తం చేసి వేల కోట్లు పరోక్షంగా ప్రభుత్వంమే దోచిపెట్టే ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసి. గుజరాతీలకు ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించిన ఘనత కూడా 80 అంగుళాల ఛాతీకే దక్కింది.

బడా కార్పొరేట్ శక్తులు తన షెల్ కంపెనీల ద్వారా కోట్లాది రూపాయల ఎన్నికల బాండ్లు బీజేపీ ఖాతాలో జమ చేసి ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం కు తెర తీశారు. దీన్నే కార్పొరేట్ భాషలో క్విడ్ ప్రో అంటారు. బీజేపీ తన సోషల్ మీడియా ద్వారా తప్పుడు నారేటివ్‌ను ప్రచారం చేసుకుంటూ మోడీ అంటే దేవుడు అన్న రేంజ్‌లో బ్రాండింగ్ చేసుకోవడం అటు బీజేపీ ఉనికికి గానీ దేశానికి గానీ శ్రేయస్కరం ఎంతమాత్రం కాదు. వ్యవస్థలను చెరబట్టి తన ఇంటి కాపలా కుక్క లాగా వాడుకున్న ఏ ఒక్క సంస్థ మనుగడ సాగించినట్టు చరిత్రలో లేదు. నియంతృత్వ పోకడలతో, బలప్రయోగం ద్వారా పాలన చేయాలన్న పాలకుల కలలకు ప్రజలు చరమగీతం పాడే రోజులు సమీపంలోనే ఉన్నాయి.

దొమ్మాట వెంకటేష్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

98480 57274



Next Story

Most Viewed