తెర వెనుక దోస్తులు... పబ్లిక్‌లో దుష్మన్

by Disha edit |
తెర వెనుక దోస్తులు... పబ్లిక్‌లో దుష్మన్
X

ప్రజలను బావోద్వేగాలలో ముంచడంలో అందెవేసిన చెయ్యి బీజేపీ సొంతం. అదే కోవలో రాజకీయం చేయడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అదే విద్యతో కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించి రెండు సార్లు అధికారంలోకి రాగలిగాడు. చెట్టు మీది కాయకు బాణం గురి పెడితే అటు తిరిగి ఇటు తిరిగి తనకే తగిలినట్టు కేసీఆర్ నడవడిక చూసిన వారికి ఇట్టే అర్థం అవుతుంది. నాడు రెండు కండ్ల సిద్ధాంతంతో చంద్రబాబు రాజకీయం చేస్తే కేసీఆర్ రెండు పడవలపై ప్రయాణం చేశారు. రెండు రేసు గుర్రాలను పరుగులు పెట్టిస్తున్నట్టు బండి సంజయ్‌ని, రేవంత్ రెడ్డి‌ని ఉరికించి ఉరికించి తానే బొక్కబోర్ల పడ్డారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన చరిత్ర బీజేపీది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చేసిన ‘హిందు గాళ్ళు బొందు గాళ్ళు’ వ్యాఖ్యలు బీజేపీ‌కి బూస్ట్ నిచ్చాయని చెప్పక తప్పదు. 2019లో కేసీర్ కాకతాళీయంగా చేసిన వ్యాఖ్యల కారణంగా తెలంగాణలో బీజేపీ అకౌంట్‌లో నాలుగు ఎంపీ స్థానాలు వచ్చిపడ్డాయి. అలాగే కేంద్రంలో సైతం ఆనాటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో 'కారు సారు సర్కార్' అనే నినాదంతో కేంద్రంలో హంగ్ ప్రభుత్వం వస్తుందని ప్రచారం చేశారు. కానీ సర్జికల్ స్ట్రైక్‌తో బీజేపీ కూడా ఊహించని విధంగా కేంద్రంలో సీట్లు రావడం కేసీఆర్ తోక ముడవడం చూశాం.

బీజేపీకి చేయూతనిచ్చే వ్యాఖ్యలు..

2024లోనూ ఇలాంటి వ్యాఖ్యలే కేసీఆర్ చేస్తున్నారు. 2019 కన్నా ఎక్కువ సీట్లలో కేంద్రంలో అధికారంలోకీ వస్తామని బీజేపీ పెద్దలు ప్రచారం చేస్తున్నప్పటికీ... మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ సెక్యులర్ పార్టీ అని చెబుతూనే హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు. ‘అక్షింతలు, పులిహోర కడుపు నింపవు కదా? అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చేస్తూ పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్నారు రాజకీయ మేధావులు. కేసీఆర్ వ్యాఖ్యలతో బీజేపీలో కింది స్థాయి నుంచి అగ్రనేతల వరకు తెలంగాణలో డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు. నాడు హిందు గాళ్లు బొందు గాళ్లు అంటే నాలుగు స్థానాల్లో విజయం పొందిన బీజేపీకి... నేడు కేసీఆర్ రాముడు, అక్షింతలు, పులిహోర అంటూ వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకీ చేయూతనిచ్చేలాగా ఉపయోగపడుతున్నాయా అంటే అవుననే అంటున్నారు మేధావులు, విద్యావంతులు. రాముడు పేరుతో పసుపు బియ్యం కలిపి అక్షింతలు, పులిహోర ఇస్తే కడుపు నిండుతుందా…? అంటూనే మరో వైపు అల్లా ఆశీర్వాదంతోనే తెలంగాణ ఏర్పడిందంటూ ప్రసంగం ముగిస్తున్నారు. అంటే తెలంగాణ ఏర్పాటులో హిందూ దేవుళ్ళ పాత్ర లేదా అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు?

శ్రేణులే ఖంగుతినేలా మార్పులు

ఓ మెజారిటీ వర్గాల మనోభావాలు దెబ్బతీస్తూనే… మరోవైపు మైనారిటీ మన్ననలు... మెప్పు పొందడానికి యత్నం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఎంత ఎడబాటు తేవాలో అంత ఓ వైపు బీజేపీ నేతలు మరోవైపు కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తెర వెనుక దోస్తులు... పబ్లిక్‌లో దుష్మన్ తరహాలో మున్నా సినిమాలో చూపిన సన్నివేశం ప్రస్తుతం బీజేపీ... బీఆర్ఎస్ అధినేతలు మాటలు వింటే ఇట్టే అవగతం అవుతున్నాయని మేధావులు ఆక్షేపిస్తున్నారు.

2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అత్తా కోడళ్ళ పంచాయితీ మాదిరి కొన్ని రోజులు అత్త.. మరికొన్ని రోజులు కోడలి రాజ్యం అనేలా వ్యవహారం నడిపిండు. రెండు జాతీయ పార్టీలు నువ్వా నేనా అని ఎదగడానికి పోటీ పడుతున్న తరుణంలో ఢిల్లీ లిక్కర్ స్కాం తెరపైకి రాగానే హుటా హుటిన కేటీఆర్‌ను బీజేపీ పెద్దల వద్దకు పంపి అరెస్ట్ కాకుండా చేసుడు... బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్‌ని మార్చుడు చకచక జరిగిపోవడం తెలంగాణ ప్రజలు... బీజేపీ శ్రేణులు ఖంగుతిన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కాకపోవడంతో బీజేపీ గ్రాఫ్ అమాంతం నేలకు దిగిపోయింది. ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ప్రజల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేననే భావం గట్టిగా వెళ్లిపోవడం... బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అభ్యర్థులపై వ్యతిరేకత కేసీఆర్ కొంప ముంచింది.

స్టేట్ నాకు, సెంట్రల్ నీకు…

నాడు కవిత అరెస్ట్ అయ్యుంటే బీజేపీ 20 నుండి 30 సీట్లు సునాయాసంగా గెలిచేదని చేజేతులారా వచ్చిన అవకాశం కోల్పోయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, బీజేపీతో ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగంగానే స్టేట్ నాకు (కేసీఆర్) సెంట్రల్ నీకు (మోడీ) అనే పరస్పర ఒప్పందం ప్రకారంగానే అదంతా జరిగిందనే ప్రచారం సాగింది. తెలంగాణలో కేసీఆర్ అధికారానికి దూరమై నప్పటికీ బీజేపీపైనే ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో మెజారిటీ తో సంబంధం లేకుండా తాను చక్రం తిప్పాలని భావిస్తూ... బిడ్డను బయటకు తీసుకుని రావడం ప్రధాన కర్తవ్యంగా పావులు కడుపుతున్నారు. తాను మునిగినా పర్లేదు బీజేపీని లేపాలని కేసీఆర్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సత్యారం భీమప్ప

జర్నలిస్ట్

99593 80524

Next Story

Most Viewed