భావప్రకటన స్వేచ్ఛపై దాడి!

by Disha edit |
భావప్రకటన స్వేచ్ఛపై దాడి!
X

మతం, రాజకీయం వ్యక్తి విశ్వాసాలకు సంబంధించినది. వీటిపై మరొకరి పెత్తనం లేదా ఆదిపత్యం సహించరానివి. ఈ విశ్వాసాలు కూడా పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మారుతూ వస్తాయి. అందుకు అనుగుణంగా మనిషి ఆలోచనా విధానం మార్పు చెందుతుంది. ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకెళ్తుంటే, సనాతన ధర్మ రక్షణ పేరిట ప్రచారం చేయడం సగటు పేదవాన్ని మతపు సంకెళ్లతో కట్టి వేయాలనేది నీచమైన ఆలోచన. ఇది మానవుడిలో పెరుగుతున్న ప్రశ్నించే తత్వాన్ని మరుగున పరిచే ప్రయత్నమే.

సమాధానం చెప్పలేని సందర్భంలోనే..

వివిధ రంగాలకు చెందిన రచయితలు ఐక్యవేదిక ఏర్పడి నిర్వహించిన ‘సాహిత్యంలో- లౌకిక విలువలు’ అంటూ సెక్యులర్ రచయితల వేదిక సమూహం కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఓ సభపై హిందూ ఫాసిస్ట్ మతోన్మాద శక్తుల దాడి దుర్మార్గం. ఇది కవుల మీద జరిగిన దాడి కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో చర్చించవలసిన ప్రాధాన్యత అంశంపై మాట్లాడుతుండగా అనుమతుల పేరిట, నచ్చని అంశాలు అంటూ దాడికి పాల్పడడం, శాంతియుతంగా అభిప్రాయాల వెల్లడి జరుగుతున్న సందర్భంలో సభను అడ్డుకోవడం, రచయితలపై దాడి చేయడం క్షమించరాని నేరం. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక, సౌమ్యవాద స్ఫూర్తికి భంగం కలిగించడమే. తప్పులు ప్రశ్నించే, నిలదీసే వారిపై మూక దాడులు చేయడం అనాదిగా వస్తున్నది. స్పార్టకస్, గేలీలియో... ఇలా ఎందరో హేళనకు బలైనవారే. చైతన్యవంతమైన పౌర పౌర సమాజం సంధించే ప్రశ్నలకు జవాబు చెప్పలేని సందర్భంలో కేవలం మూర్ఖులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు.

పరమత సహనం ఏది?

ప్రస్తుత యువత ఉద్యోగాల వేటలో వివిధ దేశాలు వెళ్లి స్థిరపడుతున్నారు. ఇలాంటి దాడులు మిగతా దేశాలలో కొనసాగితే మన దేశపౌరుల పరిస్థితి ఏమిటి? హిందూ మతంలో చాతుర్‌వర్ణ వ్యవస్థ అది సృష్టించిన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ సమూహాలుగా విభజించింది. ఫలితంగా సామూహికంగా రాజ్యంపై తిరగబడి, హక్కుల సాధన కోసం పోరాడాల్సిన శక్తులలో ఐక్యత కొరవడింది. బడిలోకి గుడిలోకి కొన్ని కులాలను నిషేధించడం వల్ల కొత్త మతాలు ఆదరించడంతో ఆయా మతాలు బలపడ్డాయి. చెరువులో బావులలో సైతం నీరు తాగనివ్వలేదు, స్నానం చేయనివ్వలేదు. ఈ దురాచారాలపై అనాదిగా పోరాటం సాగుతూనే ఉంది. అయితే, మతాలు ఏవైనా పరమత సహనం పాటించమన్నాయి. కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయమన్నాయి. మరి ఆచరణలో జరుగుతున్నది ఏమిటి? యావత్ తెలంగాణా ప్రజలు, పౌరసమాజం, మేధావులు, ముఖ్యంగా యువత మనసుపెట్టి ఆలోచించాల్సిన సమయం ఇది. వ్యక్తిగతమైన ఆశయాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దడం, దాడులు చేసి సమాజంలో భయాందోళనలు రేకెత్తించడం వంటి చర్యలను నిరసించాలి.

రమణా చారి

99898 63039

Next Story

Most Viewed