భారత వృద్ధి అంచనాను భారీగా పెంచిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్

by Dishanational1 |
భారత వృద్ధి అంచనాను భారీగా పెంచిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్(ఇండ్-రా) 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను భారీగా పెంచింది. ఇదివరకు అంచనా వేసిన 6.5 శాతం నుంచి ఏకంగా 7.1 శాతానికి సవరిస్తూ ఇండ్-రా సోమవారం ప్రకటనలో తెలిపింది. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) అంచనా వేసిన 7 శాతం కంటే ఎక్కువ. అధిక వృద్ధి అంచనాకు ప్రధానంగా స్థిరమైన ప్రభుత్వ మూలధన వ్యయం, కార్పొరేట్, బ్యాంకింగ్ రంగ బ్యాలెన్స్ షీట్లు మెరుగ్గా ఉండటం, అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ కార్పొరేట్ మూలధన వ్యయం వంటి అంశాలు భారత వృద్ధికి దోహదపడనునాయి. దేశీయంగా సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ఎగుమతుల రంగంలో డిమాండ్, ఇతర సవాళ్లు ఉంటాయని ఇండ్-రా అభిప్రాయపడింది. మరోవైపు గ్రామీణ వినియోగం బలహీనంగా ఉంది. అయితే, ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనాల నేపథ్యంలో ఇది మెరుగుపడుతుందని ఇండ్-రా పేర్కొంది. ప్రైవేత్ రంగానికి సంబంధించి ముడిచమురు, బేస్ మెటల్స్, పవర్, టెలికాం రంగాల్లో పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది.

Next Story

Most Viewed