బీఆర్ఎస్ పని ఖతం.. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
బీఆర్ఎస్ పని ఖతం.. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముస్లింలను ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ కోరుతోందని, మత మార్పిడి తర్వాత ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్.. అభద్రతా భావంతో ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని ఆయన ఫైరయ్యారు. దేవుడి పేరు చెప్పి బీజేపీ ఓట్లు అడుగుతోందని ప్రచారం చేస్తున్నారని, కానీ రుణమాఫీ చేస్తానని దేవుడిపై ప్రమాణం చేస్తున్నదెవరని లక్ష్మణ్ ప్రశ్నించారు. మోడీ నాయకత్వాన్ని ప్రపంచం మొత్తం కోరుకుంటోందని, మసి పూసి మారేడు కాయ చేయాలనే రేవంత్ రెడ్డి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన ఫైరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ అధికారం చేపట్టిందని ఆయన ధ్వజమెత్తారు. మజ్లిస్ ని పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ అని ఫైరయ్యారు. అలాంటి కాంగ్రెస్ నేడు లౌకికవాదం అంటూ మాట్లాడుతోందని మండిపడ్డారు. సీఏఏను ముస్లింలకు వ్యతిరేకం అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని లక్ష్మణ్ విరుచుకుపడ్డారు.

ఎవరు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకోవాలని లక్ష్మణ్ కోరారు. ఓటు బ్యాంక్ కోసం కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్ కల్పించిందని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జాతీయ వాదులను టార్గెట్ గా చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రోహింగ్యాలకు మజ్లిస్ స్థావరాల్లో నివాసం ఏర్పాటు చేసి వారికి ఆధార్ కార్డులు కూడా ఇప్పించారని పేర్కొన్నారు. వారితో ఓటు బ్యాంక్ పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లక్ష్మణ్ సూచించారు. విభజించి పాలించే విధానాలు కాంగ్రెస్ ఎంచుకుందన్నారు. సికింద్రాబాద్ లో ఎవరు గెలిస్తే వారే దేశంలో అధికారంలోకి వస్తారని మాట్లాడుతున్నారని, అక్కడ గెలిచేది బీజేపీయేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ఇకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైందని, ఆ పార్టీని ఓఎల్ఎక్స్ లో సేల్‌కు పెట్టినా కొనేవారు లేరని లక్ష్మణ్ చురకలంటించారు.



Next Story

Most Viewed