Botsa Sandeep in the land Dispute: భూవివాదంలో బొత్స వారసుడు..

by Disha Web Desk 3 |
Botsa Sandeep in the land Dispute: భూవివాదంలో బొత్స వారసుడు..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అటు అసెంబ్లీ ఎన్నికలు, ఇటు సార్వత్రిక ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఇక ఎన్నికలకు మరో ఏడు రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో భూవివాదం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ పేరు వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో భూవివాదం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ భూవివాదం కేసులో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. షాబాద్‌ మండలం మాచన్‌పల్లిలో ఉన్న సర్వే నెంబర్ 442లో 31 ఎకరాల భూమి ఉంది. కాగా ఈ భూమికి సంబంధించిన వివరాలున్న ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ ద్వారా తారుమారు చేశారని ఆరోపిస్తూ.. బొప్పి మహేందర్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే ప్రస్తుతం ఆ భూమి యజమానుల్లో బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు కూడా ఉండడం గమనార్హం. కాగా మహేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆ భూమి తమ ముత్తాత పోచయ్య పేరుతో ఉందని, ఆయన మృతిచెందగా కుమారులు నిరక్షరాస్యతతో మ్యుటేషన్‌ చేయించుకోలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

అలానే 2018లో రైతుబంధు పథకం డీడీ కూడా పోచయ్య పేరుతో వచ్చిందని వెల్లడించారు. కాగా మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా సివిల్‌ కోర్టు నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సిందిగా సూచించారని తెలిపారు. అయితే వారసుల్లో ఒకరు భాగపరిష్కారం కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించారని, ఈ నేపథ్యంలో సర్వే నం.442లోని 15 ఎకరాల భూమి చేగూరి రమేశ్‌ పేరుతో ఉన్నట్టు తెలిసింది అని పేర్కొన్నారు.

కాగా అతను ఆ పొలాన్ని సయ్యద్‌ రహీం ఉద్దీన్‌, సయ్యద్‌ ఇంతియాజ్‌ ఉద్దీన్‌లకు అమ్మగా, వారు వేరొకరికి విక్రయించారని తెలిపారు. అలా కొన్నవారిలో బొత్స సందీప్‌ పేరు కూడ ఉంది. ఈ నేపథ్యంలో వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేశారు.

Read More..

నేడు ఆ నియోజకవర్గంలో పవన్ పర్యటన.. హెలిప్యాడ్‌ను ధ్వంసం చేసిన దుండగులు..

Next Story

Most Viewed