కోల్‌కతా సూపర్ విక్టరీ.. ముంబై ఎలిమినేట్!

by Dishanational3 |
కోల్‌కతా సూపర్ విక్టరీ.. ముంబై ఎలిమినేట్!
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. కోల్‌కతా చేతిలో ఓటమితో ఆ జట్టు నాకౌట్ రేసు నుంచి తప్పుకున్నట్టే. అధికారికంగా ప్రకటించకపోయినా ముంబై ముందడుగు వేసే పరిస్థితి లేదు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 24 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో ముంబైని కేకేఆర్‌ ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులు చేసి ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్(70) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. మనీశ్ పాండే(42) సైతం రాణించాడు. బుమ్రా(3/18), నువాన్ తుషారా(3/42) బంతితో మెరవడంతో కేకేఆర్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అయితే, మోస్తరు లక్ష్యాన్ని కోల్‌కతా బౌలర్లు కాపాడుకున్నాడు. ఛేదనకు దిగిన ముంబైని 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూల్చారు. సూర్యకుమార్(56) అర్ధ శతకం రాణించగా.. మిగతా వారు తేలిపోయారు. స్టార్(4/33) నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. ఈ సీజన్‌లో 7 విజయంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ బెర్త్‌కు మరింత చేరువైంది.

తేలిపోయిన ముంబై

170 పరుగుల మోస్తరు లక్ష్య ఛేదనలో ముంబై కనీసం పోరాడలేకపోయింది. పిచ్ అనుకూలతతో రెచ్చిపోయిన కేకేఆర్ బౌలర్ల ధాటికి ఆ జట్టు విలవిలలాడింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే స్టార్క్.. ఇషాన్ కిషన్(13) అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(11), నమన్ ధిర్(11) క్రీజులో నిలువలేకపోయారు. దీంతో పవర్ ప్లేలో ముంబై 46/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత సూర్యకుమార్ జట్టును ఆదుకునేందుకు చూశాడు. అయితే, మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు. అయినప్పటికీ ఒంటరి పోరాటంతో జట్టును నడిపించాడు. మరోవైపు, కేకేఆర్ బౌలర్లు వరుస వికెట్లతో మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో ముంబై విజయావకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. తిలక్ వర్మ(4), నేహాల్(6), కెప్టెన్ పాండ్యా(1) దారుణంగా విఫలమయ్యారు. మరోవైపు, హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కాసేపటికే సూర్య(56)ను రస్సెల్ అవుట్ చేయడంతో ముంబై ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. ఆఖర్లో టిమ్ డేవిడ్(24) అద్భుతం చేస్తాడని ఎక్కడో ముంబై జట్టులో ఆశలు ఉన్నా.. స్టార్క్ వాటిపై నీళ్లు చల్లాడు. ఒకే ఓవర్‌లో టిమ్ డేవిడ్‌తోపాటు పీయూశ్ చావ్లా(0), గెరాల్డ్ కోయ్టజి(8)ని అవుట్ చేయడంతోపాటు మరో 7 బంతులు మిగిలి ఉండగానే ముంబై ఆట ముగిసింది. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఆదుకున్న వెంకటేశ్

అంతకుముందు కోల్‌కతా ఇన్నింగ్స్ అనుకున్నట్టు సాగలేదు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ముఖ్యంగా నువాన్ తుషారా ధాటికి కేకేఆర్‌ టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఓవర్‌లోనే సాల్ట్(5)అవుట్ చేసిన అతను.. మూడో ఓవర్‌లో రఘువంశీ(13), శ్రేయస్ అయ్యర్(6)ను పెవిలియన్ పంపి కోలుకోని దెబ్బ కొట్టాడు. కాసేపటికే నరైన్(8), రింకు సింగ్(9) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు 100 పరుగులైనా చేస్తుందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. ముంబై ముందు కోల్‌కతా 170 పరుగుల మోస్తరు లక్ష్యం పెట్టడానికి వెంకటేశ్ పోరాటమే కారణం. మనీశ్ పాండే‌తో కలిసి అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరు ఆచితూచి ఆడుతూనే బౌండరీలు బాదారు. ఈ క్రమంలో వెంకటేశ్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 6వ వికెట్‌కు వీరు 83 పరుగులు జోడించారు. మనీశ్ పాండే(42)ను పాండ్యా అవుట్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత రస్సెల్(7), రమణ్‌దీప్ సింగ్(2) విఫలమమైనా.. వెంకటేశ్ అయ్యర్ ఒంటరి పోరాటం చేశాడు. ఇక, బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో ఐదో బంతికి వెంకటేశ్(70) బౌల్డ్ అవడంతో అతని పోరాటంతోపాటు కేకేఆర్ ఆట ముగిసింది. ముంబై బౌలర్లలో బుమ్రా, నువాన్ తుషారా మూడేసి వికెట్లతో సత్తాచాటారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు, చావ్లాకు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 169 ఆలౌట్(19.5 ఓవర్లు)

సాల్ట్(సి)తిలక్(బి)నువాన్ తుషారా 5, నరైన్(బి)పాండ్యా 8, రఘువంశీ(సి)సూర్యకుమార్(బి)నువాన్ తుషారా 13, శ్రేయస్ అయ్యర్(సి)టిమ్ డేవిడ్(బి)నువాన్ తుషారా 6, వెంకటేశ్ అయ్యర్(బి)బుమ్రా 70, రింకు సింగ్(సి అండ్ బి) చావ్లా 9, మనీశ్ పాండే(సి)డెవాల్డ్ బ్రెవిస్(బి)పాండ్యా 42, రస్సెల్ రనౌట్(నువాన్ తుషారా/పాండ్యా) 7, రమణ్‌దీప్(సి)గెరాల్డ్ కోయ్టజి(బి)బుమ్రా 2, స్టార్క్(బి)బుమ్రా 0, వైభవ్ అరోరా 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 7-1, 22-2, 28-3, 43-4, 57-5, 140-6, 153-7, 155-8, 155-9, 169-10

బౌలింగ్ : నువాన్ తుషారా(4-0-42-3), బుమ్రా(3.5-0-18-3), గెరాల్డ్ కోయ్టజి(2-0-24-0), పాండ్యా(4-0-44-2), నమన్ ధిర్(3-0-25-0), చావ్లా(3-0-15-1)

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 145 ఆలౌట్(18.5 ఓవర్లు)

ఇషాన్ కిషన్(బి)స్టార్క్ 12, రోహిత్(సి)మనీశ్ పాండే(బి)నరైన్ 11, నమన్ ధిర్(బి)చక్రవర్తి 11, సూర్యకుమార్(సి)సాల్ట్(బి)రస్సెల్ 56, తిలక్(సి)నరైన్(బి)చక్రవర్తి 4, నేహాల్(బి)నరైన్ 6, పాండ్యా(సి)మనీశ్ పాండే(బి)రస్సెల్ 1, టిమ్ డేవిడ్(సి)శ్రేయస్ అయ్యర్(బి)స్టార్క్ 8, గెరాల్ట్ కోయ్టజి(బి)స్టార్క్ 8, పీయూశ్ చావ్లా(సి)నరైన్(బి)స్టార్క్ 0, బుమ్రా 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 10.

వికెట్ల పతనం : 16-1, 38-2, 46-3, 61-4, 70-5, 71-6, 120-7, 144-8, 144-9, 145-10

బౌలింగ్ : వైభవ్(3-0-35-0), స్టార్క్(3.5-0-33-4), వరుణ్ చక్రవర్తి(4-0-22-2), సునీల్ నరైన్(4-0-22-2), రస్సెల్(4-0-30-2)

Next Story

Most Viewed